అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గినా.. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం ఆగనంటోంది. మరింత పతనం దిశగా పరుగులు తీస్తున్నది. మంగళవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి మరో ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. సోమవారం ట్రేడింగ్ ముగింపుతో పోలిస్తే 41 పైసలు నష్టపోయి మంగళవారం ముగింపు రూ.79.36 వద్ద నిలిచింది. సోమవారం ట్రేడింగ్ ముగింపులో 79.04 వద్ద స్థిర పడింది.
ఇంట్రాడేలో రూపాయి ఇలా
ఇంట్రా డే ట్రేడింగ్‌లో రూపాయి 79.02-79-38 మధ్య ట్రేడయింది. తాజాగా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి నిరంతరం విదేశీ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకోవడమే రూపాయి పతనానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నుంచి..
గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచి ముడి చమురు, బంగారం, ఇతర కమోడిటీ ధరలు పెరిగిపోయాయి. దీంతో అమెరికా డాలర్‌పై రూపాయి పతనమవుతూనే ఉన్నది. ఫిబ్రవరి 24న 102 పైసలు నష్టపోయి 75.63 రూపాయిల వద్ద స్థిర పడింది. తిరిగి మార్చి ఏడో తేదీన 81 పైసల నష్టంతో రూ.77.02లకు, మే తొమ్మిదో తేదీన రూ.77.58కి పతనమైంది. మే 19న 77.72 రూపాయల వద్దకు పడిపోయింది.
గత నెలలో ఇలా
గత నెల 13న స్టాక్‌మార్కెట్లలో ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిళ్లతో రూపాయి 20 పైసలు నష్టపోయి రూ.78.13 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 78.02-78.29 మధ్య తచ్చాడింది. ఆసియా దేశాల కరెన్సీలన్నీ బలహీన పడటం వల్లే రూపాయి పతనమైందని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 28న 48 పైసల నష్టంతో రూ.78.85 వద్ద ముగిసింది. గత నెల 29న రూ.79.04లకు బక్కచిక్కింది. వివిధ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, ముడి చమురు ధరలు భగ్గుమనడం, దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకోవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు పెంచినా ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనమవుతున్నది.
మున్ముందు 81 మార్క్‌కు కూడా..?
గతంలో పారెక్స్ మార్కెట్లో రూపాయి ఏమాత్రం నష్టపోయినా ఆర్బీఐ జోక్యం చేసుకునేది. బహిరంగ మార్కెట్లోకి డాలర్లు విడుదల చేయడం ద్వారా రూపాయి పతనాన్ని నిలువరించేది. కానీ, ఇటీవలి కాలంలో రూపాయి పతనాన్ని నిలువరించడానికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒకవేళ కొన్ని చర్యలు తీసుకున్నా.. సరిపోవడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.81 మార్క్ దాటి పతనం కావచ్చునని ఫారెక్స్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు