అత్యంత నైపుణ్యం, అధిక సగటు వేతనాలిచ్చే వైట్ కాలర్ జాబ్స్‌కు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. ఈ ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. ఢిల్లీ, బెంగళూరు కన్నా హైదరాబాద్ (15 శాతం)లోనే ఎక్కువగా ఈ ఉద్యోగాలు పొందుతున్నారని ‘మాన్‌స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్’ నివేదిక తెలిపింది. వైట్ కాలర్ ఉద్యోగ నియామకాల్లో ముంబై 23శాతంలో తొలిస్థానం, తమిళనాడులోని కోయంబత్తూరు 19 శాతంతో రెండోస్థానంలో నిలిచాయని వెల్లడించింది. కాగా, దేశంలో అన్ని రంగాల్లో ఉద్యోగ నియామకాలు పెరుగుతున్నట్టు నివేదిక తెలిపింది. 2021 మే నుంచి తీసుకొంటే దేశంలోని 13 ప్రధాన నగరాల్లో ఉద్యోగుల నియామకాల శాతం గణనీయంగా పెరిగింది. ప్రధాన రంగాలతో పాటు ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్, ఎన్జీవో సోషల్ సర్వీస్, అగ్రి సంబంధిత పరిశ్రమలు, ఆటోమేషన్, పర్చేజ్ లాజిస్టిక్స్ సైప్లె, లీగల్ తదితర రంగాల్లో ఉపాధి, ఉద్యోగాల కల్పన పెద్ద ఎత్తున జరుగుతున్నదని నివేదిక పేర్కొన్నది.
ఐటీ రిక్రూట్‌మెంట్‌లో టాప్-2
ఐటీ నియామకాల్లో హైదరాబాద్ టాప్-2 నిలిచింది. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై వంటి నగరాలను వెనక్కి నెట్టింది. ఢిల్లీ తొలి స్థానంలో ఉన్నది. తెలంగాణలో ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతున్నది. ఐటీ వార్షిక నివేదిక ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 1,49,506 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. దీంతో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఉద్యోగుల సంఖ్య మొత్తం 7,78,121కి చేరుకొన్నది. 2020-21తో పోల్చితే 2021-22లో తెలంగాణ 23.78 శాతంతో అసాధారణ పెరుగుదల నమోదుచేసింది. 2013-14 నుంచి తీసుకొంటే ఐటీ ఉద్యోగాల కల్పనలో 140 శాతం వృద్ధిని సాధించింది.
దేశంలో పెరగని జీత భత్యాలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.. ఉప్పులు, పప్పుల ధరలు ఆకాశాన్నంటాయి.. కూరగాయల రేట్లు కొండెక్కాయి.. గుండు సూది దగ్గరి నుంచి పిల్లల స్కూల్ ఫీజుల దాకా ధరలన్నీ పెరిగాయి. కానీ, సగటు ఉద్యోగి జీతం మాత్రం పెరగలేదని కేంద్ర ప్రభుత్వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) తేల్చింది. దేశవ్యాప్తంగా గత పదేండ్లలో ఉద్యోగుల జీతభత్యాలపై జూలై 2020 – జూన్ 2021 మధ్య సర్వే చేయగా.. గ్రామీణ ప్రాంతాల్లో 13 శాతం కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో 42.5 శాతం కుటుంబాలు మాత్రమే రెగ్యులర్ సాలరీ/ వేజ్ ఎర్నర్స్ ఉన్నట్టు తేలింది. 2011-12తో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో 3 శాతం, పట్టణాల్లో 1 శాతం మాత్రమే సాలరీడ్ ఎంప్లాయిస్ పెరగటం గమనార్హం. అటు.. సాలరీడ్ ఎంప్లాయిస్‌లో తెలంగాణ మెరుగైన స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో 11.4తో దేశంలోనే నాలుగో స్థానంలో, పట్టణాల్లో 48.4 శాతంతో రెండోస్థానంలో నిలిచింది. ఈ జాబితాతో డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలోని బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ చిట్టచివరన ఉన్నాయి.