DailyDose

ఝాన్సీ రాణి ఆంగ్లేయులపై విసిరిన ‘ఆస్ట్రేలియా’ విఫల పాచిక

Auto Draft

ఆ మధ్య ఆస్ట్రేలియా ప్రధానిని కలిసిన సందర్భంగా.. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘జాన్‌ లాంగ్‌ పిటిషన్‌’ను ఆయనతో పంచుకున్నారు. ఇంతకూ ఎవ్వరీ జాన్‌లాంగ్‌? ఏమిటా పిటిషన్‌ అని వెదికితే.. ఆ లంకె కాస్తా 1857 ప్రథమ స్వాతంత్య్ర సమరానికి దారితీసింది. నేరుగా యుద్ధానికి దిగే ముందు.. ఝాన్సీ రాణి ఆంగ్లేయులపై విసిరిన ఆస్ట్రేలియా విఫల పాచిక.. జాన్‌లాంగ్‌!

భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ వీరవనిత రాణి ఝాన్సీ లక్ష్మీబాయితో ముఖాముఖి మాట్లాడిన ఏకైక శ్వేతజాతీయుడు జాన్‌లాంగ్‌. సిడ్నీలో జన్మించి లండన్‌లో న్యాయశాస్త్రం అభ్యసించిన లాంగ్‌ ఆస్ట్రేలియాలో లాయర్‌గా స్థిరపడటానికి ప్రయత్నించాడు. కానీ అక్కడంత లాభదాయకంగా కనిపించలేదు. అప్పటికే ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న భారత్‌లో ఆయన సమీప బంధువు మంచి న్యాయవాదిగా పేరుగాంచాడు. ఆయన సలహా మేరకు జాన్‌లాంగ్‌ భారత్‌ బాట పట్టాడు. 1842లో భార్య, ఇద్దరు పిల్లలతో కలసి కలకత్తాలో అడుగుపెట్టాడు. ఆ ప్రదేశం అంతగా నచ్చని లాంగ్‌ మేరఠ్‌ చేరాడు. లాయర్‌గా చేస్తూనే.. అక్కడే ‘ది మఫిసిలెట్‌’ అనే పత్రిక స్థాపించాడు. ఇందులో.. ఈస్టిండియా కంపెనీని, వలసవాదాన్ని విమర్శిస్తూ వ్యాసాలు రాసేవాడు. ఈ క్రమంలో.. ఓ కేసులో విజయంతో ఆయన పేరు ఝాన్సీ రాణి దృష్టిలో పడింది.

ఆంగ్లో-సిక్కు యుద్ధం సందర్భంగా ఈస్టిండియా కంపెనీకి సరకులు సరఫరా చేశాడు లాలా జ్యోతీ ప్రసాద్‌ అనే వర్తకుడు. యుద్ధానంతరం అందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని కంపెనీ ఎగ్గొట్టింది. పైగా.. లాలా జ్యోతిప్రసాద్‌పైనే ఫోర్జరీ కేసు పెట్టింది. ఈ కేసులో లాలా తరఫున జాన్‌లాంగ్‌ వాదించి 1851లో కేసు గెలిచాడు. ఆ సమయంలో ఈస్టిండియా కంపెనీ లాలాకు లక్షల్లో చెల్లించాల్సి వచ్చింది. ఈ కేసులో విజయంతో జాన్‌లాంగ్‌కు భారీ సొమ్ముతోపాటు లాయర్‌గా పేరు ప్రతిష్ఠలూ వచ్చిపడ్డాయి. ఉర్దూ, పర్షియన్‌ భాషలు నేర్చుకున్న లాంగ్‌పై చాలామంది భారతీయులకు గురి కుదిరింది.కొన్నాళ్ల తర్వాత వారసులు లేరనే వాదనతో రాణి లక్ష్మీబాయి నుంచి ఝాన్సీ రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు ఈస్టిండియా కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. ఆమె దత్త పుత్రుడిని వారసుడిగా గుర్తించి, ‘రాజ’ కిరీటం ఇవ్వటానికి నిరాకరించింది. భర్త చనిపోవటానికి ముందే పిల్లవాడిని దత్తత తీసుకున్నామంటూ.. లక్ష్మీబాయి వాదించింది. రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఈస్టిండియా కంపెనీతో జాన్‌లాంగ్‌ అయితే సమర్థంగా వాదిస్తాడని ఆయన్ను పిలిపించింది. బంగారు పత్రంపై పర్షియన్‌లో లేఖ రాసి పంపించింది.ఆ సమయానికి జాన్‌ లాంగ్‌ ఆగ్రాలో ఉన్నాడు. సకల సౌకర్యాలు, సిబ్బందిని పంపించి భారీ పల్లకీలో ఝాన్సీకి రప్పించారు. రాణి లక్ష్మీబాయితో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఆనాటి కాలంలో పరదాల మాటునే ఉండే రాణిని చూడటమంటే మాటలు కాదు. ఆ సందర్భాన్ని జాన్‌ లాంగ్‌ తన పుస్తకంలో వివరించాడు.

ఆమెనుగానీ చూసి ఉంటే..:
“ఎవ్వరికీ కనిపించని రాణిని చూడటం ఉత్కంఠగా అనిపించింది. సన్నని పరదా మాటున కూర్చున్నారామె. కొద్దిసేపటి తర్వాత ఒక్క క్షణం పాటు పరదా పక్కకు జరిపారు. ఎలాంటి ఆభరణాలు ధరించని చక్కని చుక్క కనిపించింది. చెవిపోగులు తప్ప ఆభరణాలేవీ ధరించకపోవటం ఆశ్చర్యం కల్గించింది. గంభీరమైన గొంతు.. చురుకైన మెదడు. ఇలా లిప్తపాటు కాలమైనా బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ ఆమెను చూసి ఉంటే.. ఝాన్సీని ఆమెకు తిరిగి ఇచ్చేసేవాడు” అని రాణి లక్ష్మీబాయిని జాన్‌లాంగ్‌ అభివర్ణించాడు. “ఆ సమయానికి ఝాన్సీ రాజ్య వార్షిక ఆదాయం సుమారు రూ.6లక్షలు. ఖర్చులన్నీ పోను రాణికి రూ.2.5 లక్షలు మిగిలేవి. కానీ రాజ్యాన్ని అప్పగిస్తే ఈస్టిండియా కంపెనీ ఆమెకు ఏడాదికి రూ.60 వేలు పింఛనుగా ఇవ్వజూపింది. ఇది రాణికి ఏమాత్రం ఇష్టం లేదు. కేసు తేలేదాకా పింఛను తీసుకోవాలని సూచించినా ఆమె ససేమిరా అన్నారు. మేరా ఝాన్సీ నహీ దూంగీ (నా ఝాన్సీని ఇచ్చే సమస్యే లేదు) అని ఆమె స్పష్టం చేశారు” అని లాంగ్‌ తనతో జరిపిన సంభాషణను వెల్లడించారు. రాణి తరఫున లాంగ్‌ ఈస్టిండియా కంపెనీకి పిటిషన్‌ దాఖలు చేశారు.విజయవంతమైన లాయర్‌గా పేరొందిన జాన్‌లాంగ్‌ ఈ కేసులోనూ తనను గెలిపిస్తాడనుకున్న రాణి ఎత్తుగడ తప్పని తేలింది. అంతకుముందు వ్యాపారి లాలా కేసులో భారీ మొత్తాన్ని కోల్పోయిన ఈస్టిండియా కంపెనీ వెంటనే కావాలనే లాంగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఇక యుద్ధం.. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో రాణి లక్ష్మీబాయి వీరమరణం తర్వాతి చరిత్ర! అనేక నవలలు, కథలు రాసిన జాన్‌లాంగ్‌ భారత్‌పై ప్రేమతో ఇక్కడే ఉండిపోయారు. 1864లో మసోరిలో మరణించారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రముఖ రచయిత రస్కిన్‌బాండ్‌ ఆయన సమాధిని గుర్తించారు.