రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివారం ఉదయం సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హోం మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ..దళిత మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వడం జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటని పేర్కొన్నారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. దీనిపై కమిటీ వేశామని, నివేదిక వచ్చిన అనంతరం అమలు చేస్తామని చెప్పారు. పోలీసు విభాగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నాలుగు బెటాలియన్లను మంజూరు చేసిందని, మహిళ, గిరిజన బెటాలియన్లను త్వరలోనే ప్రారంభిస్తామని వివరించారు. మహిళలకు సత్వర భద్రత కల్పించేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్నేహ పూర్వక పోలీసింగ్ విధానాన్ని కొనసాగిస్తామని హోం మంత్రి స్పష్టం చేశారు.
కఠినంగా వ్యవహరిస్తాం
Related tags :