Agriculture

‘జిగురు కలప’ ఓ ప్రయోగ సేద్యం

‘జిగురు కలప’ ఓ ప్రయోగ సేద్యం

ఎక్కడ ఏ కొత్త పంట కనిపించినా… రెండు మూడేళ్లలో మన తెలుగు రాష్ట్రాల పొలాల్లో దర్శనమిస్తుంది. అదీ మన రైతన్నల సత్తా! ఇప్పటికే ఎన్నో రకాల కొత్త పంటలను ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. అలాంటిదే ఈ ‘జిగురు కలప’ సాగు. తెలంగాణలో ఈ చెట్ల పెంపకం మొదలైంది….

అసోం రాష్ట్రంలోని హోజై అనే పల్లెటూరు.. ఊరి శివార్లలో పొడవైన చెట్లు, పిట్టల కూతల మధ్య నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోతున్నారు ఇద్దరు యువ రైతులు. బలంగా ఎదిగిన చెట్టు కాండానికి చుట్టూ డ్రిల్లింగ్‌ మిషన్‌తో ఒకరు రంధ్రాలు చేస్తుంటే.. మరొకరు వాటిల్లోకి ఫంగస్‌ని ఇంజక్ట్‌ చేస్తున్నారు.ఇదంతా గమనిస్తున్న సంపంగి ప్రసాద్‌ ఆ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో బంధిస్తున్నారు. ‘‘ఎలాంటి చెట్టుకైనా చెదలు, తెగులు పడితే అది ఎందుకూ పనికిరాదు. కానీ ఈ చెట్టుకి ఫంగస్‌ సోకాలి. అప్పుడే దీనికి విలువ పెరిగి, అద్భుతమైన సువాసన వెదజల్లుతుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కంటే మంచి ధర పలుకుతుంది’’ అని ప్రసాద్‌కి వివరించాడు, డ్రిల్లింగ్‌ మిషన్‌ను నిలిపి వేసిన అసోం రైతు.
07102022163905n20
సంపంగి ప్రసాద్‌ పూర్వీకులు ఒడిశా నుండి తెలంగాణకు వలస వచ్చారు. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల గ్రామంలో వరి పండిస్తుంటారు. వరికంటే భిన్నమైన పంటలు సాగు చేయాలన్న అన్వేషణలో ఉన్నప్పుడు.. విదేశాల్లో ఉంటున్న బంధువు ద్వారా జిగురు కలప గురించి తెలుసుకున్నాడు ప్రసాద్‌. అసోం, మిజోరాం ప్రాంతాల్లో ఈ రకమైన సాగు చేస్తున్నారని తెలిసి అక్కడ కొంతకాలం ఉన్నాడు. సాగు అధ్యయనం చేసి ఇపుడు తెలంగాణ, ఆంధ్రాలో కొందరు రైతులను ఒప్పించి .. రెండు వందల ఎకరాల్లో జిగురు కలప మొక్కలు పెంచుతున్నాడు.

కిలో తైలం రూ.60 లక్షలు..
జిగురు కలపను ‘అగర్‌ వుడ్‌’ అంటారు. అరబ్‌ దేశాల్లో ఊద్‌, భారత్‌లో అగరు, గవురు, అని వివిధ రకాల పేర్లు ఉన్నాయి. వేల సంవత్సరాల నుంచీ వాడుతున్న ఈ కలప ప్రస్ధావన కొన్ని మత గ్రంథాల్లో ఉంది. అందుకే దీనిని ‘వుడ్‌ ఆఫ్‌ ద గాడ్స్‌’ అనీ అంటారు. నాణ్యమైన చెట్ల చెక్కల నుంచి తీసిన తైలం ఖరీదు కిలో 60 లక్షల రూపాయల పైనే. కాబట్టే ‘లిక్విడ్‌ గోల్డ్‌’ అంటారు మిజోరాం రైతులు. ‘‘ఇదో రకం జిగురు చెక్క. సాధారణంగా ఏ చెట్టుకైనా బ్యాక్టీరియా సోకితే ఎండిపోతుంది. కానీ జిగురు కలప అక్వలేరియా జాతి చెట్టు. వడ్రంగి పిట్టల వల్ల గాట్లు ఏర్పడినప్పుడు చీమలు దాన్ని తొలిచి ఆహారం సేకరిస్తాయి. అలా ఒక రకం ఫంగస్‌ని కాండం లోపలకు తీసుకువెళతాయి. ఆ క్రమంలో చీమల నుంచి కారే లాలాజలం వల్ల చెట్టు దెబ్బతింటుంది. అప్పుడు ఈ చెట్లు తమను తాము కాపాడుకునే క్రమంలో మరో రకం జిగురుని ఉత్పత్తి చేస్తుంటాయి. అది రెండేళ్లకు చెక్కతో కలిసిపోయి మట్టిరంగుగా మారి.. సువాసనలు వెదజల్లుతుంది. అదే అరుదైన జిగురు కలప. దీనికి గల్ఫ్‌ దేశాల్లో విపరీతమైన డిమాండ్‌’’ అని వివరించాడు సంపంగి ప్రసాద్‌. తెలంగాణలో తొలిసారిగా జిగురు కలపనుజనగామ జిల్లా, చినరామన్‌ చెర్లలో పెంచుతున్నాడీయన. ఇదిప్పుడు ప్రయోగ దశలోనే ఉందని చెప్పాలి.
07102022163828n75
నాణ్యతను బట్టి ధర..
ఈశాన్య రాష్ట్రాల్లో భారీ విస్తీర్ణంలో జిగురు కలప చెట్లను పెంచుతున్నారు రైతులు. ఈ చెట్ల ఆకులను మరగ బెట్టి టీ తయారు చేస్తారు. కొన్ని భాగాలను ఆయుర్వేదంలోనూ వినియోగిస్తారు. జిగురు కలప లేని అత్తరు పరిశ్రమని ఊహించలేం. చెక్కల ధూపంతో వచ్చే పరిమళం పీలిస్తే, రక్తప్రసరణ పెరిగి లైంగిక ఉత్తేజం కలుగుతుందని కొందరి నమ్మకం. వీటి వాడకం గల్ఫ్‌ దేశాల్లో అధికం. ఇప్పటికే కొందరు తెలుగు రాష్ట్రాల రైతులు గత రెండేళ్లుగా వీటిని అక్కడక్కడ పెంచు తున్నారు. పొలాల్లో ఈ చెట్లను మాత్రమే సాగుచేయకూడదు. కొబ్బరి, వక్క, కోకో, శ్రీగంధం, మలబారు, వేప, మామిడి, ఇతర పండ్ల మొక్కల నీడలో అంతర పంటలుగా మాత్రమే వీటిని పెంచాలి. విడిగా పెంచితే ఎదగవు. జిగురు కలప నాణ్యతను బట్టి కిలో 4 నుంచి రూ.12 లక్షల వరకూ ధర పలుకుతోంది. సరైన పద్ధతిలో పెంచితే ఎకరాకు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ నారు కోసం నర్సరీని జంగారెడ్డి గూడెం, కల్వకుంట్లలో నిర్వహిస్తున్నారు. అయితే తొందరపడి రైతులు సొంత నిర్ణయాలతో సాగు చేయవద్దు. అనుభవజ్ఞులు, వ్యవసాయ అధికారులు, మార్కెట్‌ నిపుణుల సలహాలు తీసుకున్న తరువాతే సాగుకు పూనుకోవాలి. జిగురు కలప ఓ ప్రయోగ సేద్యం నాలుగు ఎకరాల్లో మామిడి, మునగ తోటలో అంతర పంటగా 300 అగర్‌ వుడ్‌ మొక్కలు నాటాం. మరో అయిదేళ్లు ఆగితే కాండం బాగా పెరుగు తుంది. నీరు ఇవ్వడం, విస్తరించిన కొమ్మలు నరకడం, వాటికి వైరస్‌ ఎక్కించడం వంటివన్నీ చేస్తున్నాం. మాకు ఇదొక్కటే బతుకు తెరువు కాదు. మామిడి, మునగ, నేరేడు, కాయగూరలు, వరి పండిస్తున్నాం. పశు పోషణ, నాటు కోళ్ల పెంపకం చేస్తున్నాం.