సన్నగా, నాజూగ్గా ఉన్న అమ్మాయిలకే అన్ని డిజైన్లు, రంగుల దుస్తులు నప్పుతాయనేది పాతమాట. మరి బొద్దుగా ఉన్న అమ్మాయిల పరిస్థితి…. అలాంటివాళ్ల కోసమే ఇప్పుడు ప్లస్ సైజ్ ఫ్యాషన్ అందుబాటులోకి వచ్చింది. బ్రాండ్‌లు, డిజైనర్లు కూడా వీరిని పరిగణనలోకి తీసుకుని కొత్త ట్రెండ్‌లు సృష్టిస్తున్నారు. మరి అవేంటి? వాటిని ఎలా ఎంచుకోవచ్చో వివరిస్తున్నారు డిజైనర్ దీప్తీ గణేష్.
ప్లస్‌సైజ్… ఇప్పుడు కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిల నయా ఫ్యాషన్. ఉన్న ట్రెండ్‌లు కూడా వీరికి తగిన మార్పులతో ఆకట్టుకోవడమే ఈ శైలి ప్రత్యేకత. వీరికి నలుపు రంగు ఫ్రెండ్లీ కలర్. ఏ రకం దుస్తులెంచుకున్నా సరే….ఈ వర్ణంలో ఎంచుకుంటే సన్నగా కనిపించొచ్చు. అలానే ముదురు రంగులు, లేలేత ఛాయలు కూడా వీరికి బాగుంటాయి. రెండుమూడు రంగుల్ని కాకుండా పై నుంచి కిందకు సాదాగా ఒక్క రంగునే ఎంచుకోవడం మేలు. ఎప్పుడూ అలాంటివేనా! అనుకుంటే చిన్నచిన్నమార్పులు చేసుకోవచ్చు. అంటే వాటికి పాకెట్స్ పెట్టించుకుని అవి ప్రింటెడ్ లేదా కాంట్రాస్ట్ కలర్‌లో ఉండేటట్లు చూసుకుంటే చాలు.
* అనార్కలీలు ఎంచుకోవాలనుకున్నప్పుడు ఏ లైన్స్ బాగుంటాయి. అయితే స్లిట్ లేకుండా చూసుకోండి. వీటి మీదకు దుపట్టాలను ఎంచుకునేటప్పుడు మామూలు రకాల్ని కాకుండా డ్రేప్ తరహాలో వేసుకోవచ్చు. అలానే మెడ విషయానికి వస్తే… షర్ట్‌కాలర్ రకాలకంటే ఓపెన్‌కాలర్స్ బాగుంటాయి. భుజాలు వెడల్పుగా కనిపించకుండా చేస్తాయి.
* సంప్రదాయ దుస్తులు ఎంచుకున్నా, వెస్ట్రన్ టాప్‌లు అయినా సరే! ఎంపైర్‌లైన్ ఎంచుకుంటే చాలు పొట్టభాగం హైలెట్ కాదు. జార్జెట్, సిల్క్, క్రేప్, హ్యాండ్‌లూమ్ రకాలు వీరికి సౌకర్యంగా ఉంటాయి. సన్నగా కనిపించేలా చేస్తాయి. పారదర్శకంగా కనిపించే వస్త్రరకాలతో టాప్ కుట్టించుకుని దానికి జతగా బ్లూ డెనిమ్ వేసుకుంటే వావ్ అనిపించడం ఖాయం.
* జీన్స్ ఫిట్టెడ్ రకాన్నీ ఎంచుకుని దానికి జతగా పొడవాటి టాప్‌ని వేసుకోవచ్చు. హై అండ్ లో, ఎసెమెట్రికల్ టాప్స్ వీరికి చక్కగా నప్పుతాయి.
* లావుగా ఉన్నా ఎత్తుగా ఉండేవారికి పొడవాటి గౌన్ బాగుంటుంది. దీనికి చిన్నగా కుచ్చిళ్లూ పెట్టించుకోవచ్చు. అయితే వెయిస్ట్ దగ్గర ఫిట్టింగ్‌కానీ, పార్టిషన్ కానీ లేకుండా చూసుకోవాలి. ఆ నియమం అన్ని రకాల టాప్‌లకూ వర్తిస్తుంది. జంప్‌సూట్స్, క్లౌట్టీస్ రకాలు కూడా చక్కగా నప్పుతాయి. ముఖ్యంగా క్రాప్డ్ క్లౌట్టీస్, షార్ట్‌టాప్‌తో జతచేసుకుంటే అందమంతా మీ దగ్గరే. దానికి జతగా షార్ట్ జాకెట్ కొత్త లుక్‌ని తెచ్చిపెడుతుంది.
* లావుగా ఉన్నవారికి జాలువారే స్కర్ట్‌లు అంతగా బాగోవు అనుకుంటారు. కానీ పేస్టల్ రంగుల్లో లాంగ్ స్కర్ట్‌ని ఎంచుకుని దానిమీదకు సాలిడ్ కలర్ టాప్ వేసుకుని చూడండి. ఎంతందంగా ఉంటుందో. స్కార్ప్ కూడా వేసుకోవచ్చు. అయితే యాక్సెసరీలు మాత్రం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
* స్ట్రైప్స్ ఒకప్పుడు లావుగా ఉన్నవారికి అంతగా నప్పవనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు బ్రాండ్స్, డిజైనర్లు కొత్తగా డిజైన్ చేయడం వల్ల అసెమెట్రికల్ స్ట్రైప్స్ బాగుంటున్నాయి.
* శరీరాకృతిలోని లోపాల్ని దాచిపెట్టి, బలాల్ని హైలెట్ చేయాలి. అంటే వేసుకున్న దుస్తులపై స్టేట్‌మెంట్ పీస్‌లా యాక్సెసరీస్‌ని ఎంచుకుంటే చాలు.
లావుగా ఉన్నా కూడా ఫ్యాషనబుల్‌గా ఉండొచ్చు
Related tags :