Devotional

గురు పూర్ణిమ విశిష్టత ఇదే !

గురు పూర్ణిమ విశిష్టత  ఇదే !

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ !
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!

ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి , ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.

సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిఅయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. మామూలు రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా పొంద వచ్చట.. అందుకే ఈ రోజు గురుపూజోత్సవం లో పాల్గొని గురువు కరుణా కటాక్షములను పొందవచ్చు..

గురు అనే పదంలో ’గు’ అనే అక్షరం అంధకారాన్ని ’రు’ అనే అక్షరం వెలుగును సూచిస్తాయి..

ఙ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |
*భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః *

శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు.. కాబట్టి… గురువుకే ప్రథమ స్థానమునిచ్చారు.. మాతా , పిత , గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే…

అలానే ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి..

నమోస్తుతే వ్యాస విశాల బుద్దే పుల్లార విందాయత పత్రనేత్ర |
*వినత్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమాయః ప్రదీపః *