జాన్వీకపూర్‌ని ఇప్పుడు బాలీవుడ్ అంతా నయనతారతో పోలుస్తోంది. దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకొన్న నయనతో…. జాన్వీకి పోలికేంటి? అనుకుంటున్నారా? జాన్వీ ఇప్పుడు ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమా చేసింది. ఇది నయన నటించిన ‘కోలమావు కోకిల’ అనే తమిళ చిత్రానికి రీమేక్. అందుకే జాన్వీని నయనతో పోల్చి చూస్తున్నారు. ఈ పోలిక జాన్వీకి అస్సలు నచ్చడం లేదు. ఈ విషయం తాను సూటిగానే చెబుతోంది. ‘‘నయనతార గొప్ప స్టార్. దక్షిణాదిలో తిరుగులేని నటి. ఆమెతో పోల్చడం గొప్పగానే ఉంది. కానీ నిజాయతీగా చెప్పాలంటే ఈ పోలిక నన్ను బాగా ఇబ్బంది పెడుతోంది. ఆమె నటించిన సినిమాని ఇప్పుడు నాతో రీమేక్ చేస్తున్నారు. ఆ మాత్రానికే ఇద్దరినీ పోల్చకూడదు. పైగా తమిళ చిత్రాన్ని మేం పూర్తిగా మార్చేశాం. నా పాత్ర కూడా విభిన్నంగా తీర్చిదిద్దారు. నా వయసుకి తగ్గట్టుగా మలిచారు. ఈ చిత్రంలో దక్షిణాది ఛాయలు ఏమాత్రం కనిపించవు. నేనో బీహారీ అమ్మాయిగా కనిపించబోతున్నాను. నయన పాత్రని నా స్టైల్లో చేసుకుంటూ పోయా. ‘సైరట్’ రీమేక్‌లో నటించినప్పుడు కూడా ఇలానే పోలికలు తీశారు. కానీ.. దాన్ని కూడా నా శైలిలోనే చేసుకుంటూ వెళ్లా. ఇప్పుడూ అంతే’’ అని చెప్పుకొచ్చింది.
నయనతారతో పోలికెందుకు?
