కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. అనేక చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకుంది. తెలుగులో రవితేజ ‘క్రాక్’ సినిమాలో జయమ్మగా, అల్లరి నరేశ్ ‘నాంది’ మూవీలో లాయర్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం తమిళంతోపాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన ఫ్యాన్స్‌కు బాధాకరమైన న్యూస్ చెప్పింది. ఆమె కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది.అన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలాగే, సెట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలి. ఎందుకంటే నటీనటులు అన్నిసార్లు సెట్లో మాస్కులు ధరించలేరు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్లందరూ ఇకనైనా మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై సెలబ్రిటీలు, నెటిజన్లు ‘గెట్ వెల్ సూన్’ అని స్పందిస్తున్నారు. ‘జాగ్రత్త వరూ.. నీకు మరింత ధైర్యం, బలం చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని నటి రాధిక కామెంట్ చేశారు. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సమంత ‘యశోద’, ‘బాలయ్య 107’, ‘హనుమాన్’, ‘శబరి’ వంటి తదితర చిత్రాల్లో నటిస్తోంది.