దేవాలయం అంటే దైవీశక్తికి కేంద్రం. అందుకే ప్రత్యేకమైన విధివిధానాలతో, శాస్త్ర ప్రమాణాలతో దేవాలయాన్ని నిర్మిస్తారు, దేవతా విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఐదుగురు దేవతలతో శోభిల్లే ఆలయమే పంచాయతనం. సూర్యుడు, శివుడు, విష్ణువు, గణపతి, అమ్మవారు ఈ ఐదుగురు పంచాయతన దేవతలు. ఒక దేవత ప్రతిమను మధ్యలో ప్రతిష్ఠించి మిగతా మూర్తులను విదిక్కులలో కొలువుదీరుస్తారు. మధ్యలో ఉన్న దేవతామూర్తి పేరుతో పంచాయతనంగా పిలుస్తారు.శివ పంచాయతనం: మధ్యలో శివుడు, ఈశాన్యంలో విష్ణుమూర్తి, ఆగ్నేయంలో సూర్యుడు, నైరుతిలో గణపతి, వాయవ్యంలో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు.విష్ణు పంచాయతనం: మధ్యలో విష్ణుమూర్తి విగ్రహం, ఈశాన్యంలో శివుడు, ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో సూర్యుడు, వాయవ్యంలో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు.
సూర్య పంచాయతనం: మధ్యలో సూర్యుడు, ఈశాన్యంలో శివుడు, ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో విష్ణుమూర్తి, వాయవ్యంలో దుర్గాదేవి విగ్రహాలను కొలువుదీరుస్తారు.గణపతి పంచాయతనం: మధ్యలో వినాయకుడు, ఈశాన్యంలో విష్ణువు, ఆగ్నేయంలో శివుడు, నైరుతిలో సూర్యుడు, వాయవ్యంలో దేవీ విగ్రహాలు ఉంటాయి.దేవీ పంచాయతనం: మధ్యలో అమ్మవారు వరుసగా విష్ణువు, శివుడు, గణపతి, సూర్యుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు.చాలావరకు పంచాయతనం ఒకే గర్భగుడిలో ఉండేలా ప్రతిష్ఠిస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ ఉపాలయాలు నిర్మించినా ఇదే పద్ధతిని అనుసరిస్తారు.