Devotional

లష్కర్ బోనాల చరిత్ర మీకు తెలుసా?

లష్కర్ బోనాల చరిత్ర మీకు తెలుసా?

తెలంగాణ సంస్కృతి కి అద్దంపట్టే ఆషాఢ బోనాల సమర్పణలో గోల్కొండ జగదాంబిక తొలి బోనానికి ఉన్న ప్రాధాన్యమే లష్కర్ బోనానికి ఉండటం విశేషం. భారతీయ జీవన తాత్వికతలో అంతర్భాగంగా కొనసాగుతూ వస్తున్న గొప్ప సంప్రదాయం ఇది. ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు ప్రజాదరణ కోల్పోయి కాలగమనంలో కనుమరుగైపోతున్నాయి. కానీ వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంప్రదాయం మాత్రం తెలంగాణలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తోంది. మహిళలకు ప్రాధాన్యాన్ని సంతరింపజేస్తున్న ఈ అపురూపమైన బోనం తెలంగాణ ఆత్మ. లష్కర్ బోనాలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది. 1675లో గోల్కొండ ను పాలించిన అబుల్ హాసన్ కాలంలో దక్కన్‌ లో బోనాల పండుగ మొదలైంది. రాజధాని బోనాల చరిత్రలో లష్కర్ బోనాలకు ఓ ప్రత్యేకత ఉన్నది. అదికూడా శాక్తేయ యుగానికి చెందిన పురాగాథ ఆధారంగా ప్రచారమవుతూ వచ్చిందే. జానపద పురాణాల్లో పరాశక్తి దేవతని శివుడు వివాహం చేసుకొనే వృత్తాంతం ఉంది. రుద్రుడు (శివుడు) గుమ్మడికాయలో పుడితే, పరాశక్తి సంద్రంలోపుట్టింది. ఆయన స్త్రీ దైవానికి తలవంచనన్నాడు. శక్తి ఆయనకు ఎదురుతిరిగి అలిగి ఆషాఢమాసంలో తల్లి గారింటికి వచ్చింది. కాలం గడుస్తున్న కొద్దీ పరాశక్తికి అనేక శక్తులు తోడైనాయి. వారే సప్తమాతృకలు. వారినే గ్రామ దేవతలంటారు. వారికి సోదరుడు పోతరాజు. పూర్వం లష్కర్‌లో కలరా ప్రజలను అంతం చేస్తుంటే సురిటి అయ్యప్ప ప్రార్థన మేరకు పరాశక్తి దేవతగావెలసింది. ఆమెకు తోడుగా మరోశక్తి ముత్యాలమ్మ లష్కర్‌లోనే వెలసింది. వ్యాధి నుండి ప్రజలు కాపాడబడ్డారు. శివుని ఆజ్ఞ మేరకు పోతరాజు ఘటంతో, అమ్మవారి భక్తులు ఫలహార బండ్లతో, ఆడపడుచులు బోనాలతో ఆలయానికి వెళ్లి ఆరాధించి మొక్కులు చెల్లించుకుంటారు. అదే ఆనవాయితీగా లష్కర్ మహంకాళీ ఆలయంలో ఇప్పుడు బోనాలు సమర్పించుకుంటున్నారు.