Movies

బొకే షాక్

Tamanna recalls her bouquet buying experience and its trauma

‘‘కొన్ని విషయాలు మనల్ని అంత తేలిగ్గా వదలవు. ఏదో ఒక సమయంలో గుర్తుకొస్తూ ఉంటాయి. నా జీవితంలోనూ అలాంటి విషయం ఉంది. ఎవరి చేతిలోనైనా బొకేలను చూసినప్పుడు, నేను ఎప్పుడైనా కొనడానికి వెళ్లినప్పుడు… ఆ విషయం మరీ ముఖ్యంగా గుర్తుకొస్తుంది’’ అని అన్నారు తమన్నా. ఇంతకీ ఆమె చెబుతున్నది ఏ విషయం గురించి అని అడిగితే ‘‘బొకేలు కొనడం గురించే’’ అని సమాధానమిచ్చారు. దాని గురించి వివరిస్తూ ‘‘ఒకసారి నా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ జరిగింది. నేను దుకాణానికి వెళ్లి రెండు బొకేలు కావాలని అడిగా. వాళ్లు చూపించారు. వాటిలో కొన్ని పువ్వులు నాకు నచ్చలేదు. వాటికి బదులు వేరే వాటిని పెట్టమన్నా. తాజాగా ఉన్న కొన్ని రకాల పువ్వులను సజెస్ట్ చేశా. మొత్తానికి నాకు నచ్చినట్టు బొకేలు రెండూ సిద్ధమయ్యాయి. ఆ ఆనందంతో కౌంటర్ దగ్గరకు వెళ్లి ఎంతయిందని అడిగా. షాపతను కూల్గా టీవీ చూస్తూ ‘ఆరు వేలు’ అని అన్నాడు. ఒక్క బొకే ధర రూ.3వేలా అని అనుకున్నా. అప్పుడు నా పరిస్థితి చూడాలీ… అంత ఇవ్వడానికి మనసు రాలేదు. పోనీ వద్దని చెబుదామా అంటే ఆ దారీ లేదు. ఎందుకంటే అది వాళ్లు డిజైన్ చేసిన బొకే కాదు. నాకు నచ్చినట్టు నేను చెప్పి చేయించుకున్న బొకే. వాళ్లు అడిగిన డబ్బు ఇచ్చేసి బయటపడ్డా. అయినా నా మనసులో ‘రెండు బొకేలు రూ.6వేలా? ఎంత డిజైన్ చేస్తే మాత్రం అందులో పెట్టింది పువ్వులేగా?… పువ్వులకు వేల రూపాయలు ఖర్చుపెట్టడం ఏంటి?’ అని ఒకటే ఆలోచన. ఆలోచన కాదు… హార్ట్ అటాక్ వచ్చినంత పనయింది. ఇప్పటికీ బొకేలు, బొకే షాప్లు గుర్తుకొస్తే… ముందు ఆ విషయం గుర్తుకొస్తుంది’’ అని వివరించారు తమన్నా. తెలుగులో ఆమె నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ విడుదల కావాల్సి ఉంది. ‘సైరా’ సెట్స్మీద ఉంది.