సముద్రం నుంచి పుట్టే ఉప్పు గురించి అందరికీ తెలుసు. మరి హిమాలయాల్లో తయారయ్యే లవణం గురించి తెలుసా? అవును, హిమాలయాల్లో కూడా ఉప్పు తయారవుతుంది. దీన్నే ‘పింక్ సాల్ట్’ అంటారు.పింక్ సాల్ట్ చూడటానికి సాధారణ రాళ్ల ఉప్పులానే కనిపిస్తుంది. కాకపోతే, లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇందులో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. హిమాలయ పరిసరాల్లో లభ్యం అవుతుంది కాబట్టి, హిమాలయన్ పింక్ సాల్ట్ అనీ అంటారు. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో సోడియం కాస్త తక్కువే. అందుకే సూపులు, సలాడ్లలో భాగం చేసుకుంటారు. సాధారణ ఉప్పుతో పోలిస్తే.. ఇందులో 98% సోడియం క్లోరైడ్ ఉంటుంది. దీంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం.. మొదలైన ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. అందువల్లనే సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్ ఎంతో మంచిది.పింక్ సాల్ట్ శరీరంలోని చెడు పదార్థాలను తొలగించి, నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. సోడియంను అదుపులో ఉంచి, అతిదాహాన్ని నివారిస్తుంది. రక్తపోటు నియంత్రణకు, హార్మోన్ల సమతూకానికి ఉపయోగపడుతుంది. ఈ ఉప్పులో డీటాక్సిఫికేషన్ గుణాలు ఎక్కువ. అందువల్ల శరీరంలోని వ్యర్థాలను సులభంగా బయటికి పంపగలదు. ముఖ్యంగా చర్మకణాల మధ్య ఇరుక్కుపోయిన దుమ్ము, కాలుష్యం, బ్యాక్టీరియా.. వంటి వాటిని లోపలి నుంచి శుభ్రం చేసి చర్మం మెరిసేలా చేస్తుంది. వివిధ బ్రాండ్లు దీన్ని ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ విక్రయిస్తున్నాయి.