ఓఎల్‌ఎక్స్.. మాట్రిమోనీ.. లక్కీడ్రా..తదితర మార్గాలను ఎంచుకొని సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఎలా కుదిరితే అలా.. ఎవరిని పడితే వారిని నమ్మించి మోసం చేయడమే పరమావధిగా రెచ్చిపోతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఫోన్.. వాట్సప్.. మెయిల్.. ఇలా ఏదో ఒక మార్గంలో బాధితులకు వలేసి అందినకాడికి దోచుకున్నారు.
**ఓఎల్‌ఎక్స్ లో వాహనం అమ్ముతానని..
వనస్థలిపురానికి చెందిన సతీష్(35) ఓఎల్‌ఎక్స్.కామ్‌లో హోండా యాక్టివా అమ్మకానికి ఉందనే ప్రకటన చూశాడు. ప్రకటనలో పేర్కొన్న ఫోన్ నంబర్‌లో సంప్రదించాడు. అవతలి వ్యక్తి తనను తాను భారత సైనికుడిగా పరిచయం చేసుకున్నాడు. వాహనాన్ని పంపేందుకు అవసరమైన రవాణా ఛార్జీలను ముందుగా చెల్లించాలని సూచించాడు. మిగిలిన మొత్తాన్ని వాహనం ఇంటికి చేరిన తర్వాత ఇవ్వాలన్నాడు. నిజమేనని నమ్మిన బాధితుడు గూగుల్‌పే ద్వారా తొలుత కొంత మొత్తాన్ని పంపాడు. తర్వాత మోసగాడు మరింత డబ్బు పంపాలని అడుగుతూ ఆరు దఫాలుగా రూ.1.04లక్షల్ని కాజేశాడు. అయినా సరే వాహనం చేతికి అందకపోవడంతోపాటు ఈసారి పేటీఎం ద్వారా మరో రూ.21వేలు పంపాలని మోసగాడు డిమాండ్ చేయడం ఆరంభించాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు రెండు రోజుల క్రితం రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేబీసీ లక్కీడ్రాలో రూ.25 లక్షలు గెలిచావంటూ..
సరూర్‌నగర్ ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన కూలీ(22)కి కొద్దిరోజుల క్రితం ఓ వాట్సప్ కాల్ వచ్చింది. కౌన్‌బనేగా కరోడ్‌పతి లక్కీడ్రాలో మీరు రూ.25లక్షలు గెలుచుకున్నారని అవతలి వ్యక్తి చెప్పాడు. అందుకు సంబంధించిన కొన్ని పత్రాలంటూ వాట్సప్‌లో పంపాడు. తర్వాత నేరుగా ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రైజ్‌మనీని పొందాలంటే తొలుత పన్ను కట్టాల్సి ఉందని బాధితుడిపై వలేశాడు. నిజమేనని నమ్మిన బాధితుడు మూడు దఫాలుగా రూ.1.31లక్షల్ని మోసగాడు సూచించిన ఎస్‌బీఐ ఖాతాలకు బదిలీ చేశాడు. ఆ తర్వాత కూడా మరింత డబ్బు పంపాలని కోరడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
**నేను సైనికాధికారిని.. కారు అమ్ముతా..
చర్లపల్లికి చెందిన యువకుడు(22) ఓఎల్‌ఎక్స్‌లో మహీంద్రా బొలెరో కారు విక్రయానికి సంబంధించిన ప్రకటన చూశాడు. అందులోని ఫోన్‌నంబర్‌ను సంప్రదించడంతో అవతలి వ్యక్తి అరవింద్‌కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. తాను సైనికాధికారిని అని చెప్పాడు.ధర కుదిరిన అనంతరం రవాణాఛార్జీల కింద కొంత మొత్తం చెల్లిస్తే వాహనాన్ని పంపిస్తానని చెప్పాడు. వాహనం చేరిన తర్వాత డబ్బు ఆన్‌లైన్‌లో పంపిస్తే సరిపోతుందన్నాడు. నిజమేనని నమ్మిన బాధితుడు తొలుత కొంత మొత్తాన్ని అరవింద్‌కుమార్ సూచించిన గూగుల్‌పే ఖాతాకు బదిలీ చేశాడు. అలా పలు దఫాలుగా మొత్తం రూ.2.1లక్షల్ని బదిలీ చేసిన తర్వాత అరవింద్‌కుమార్ ఫోన్ స్విచ్‌ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించాడు.
**స్కాట్లాండ్ నుంచి బహుమతి పంపుతున్నా..
ఎల్‌బీనగర్ శివగంగకాలనీకి చెందిన మహిళ(42) ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు గత నెలలో విజయ్‌సింగ్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో యాక్సెప్ట్ చేసింది. తనను తాను వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజుల చాటింగ్ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉందని విజయ్‌సింగ్ వెల్లడించాడు. శస్త్రచికిత్సల నిమిత్తం తాను స్కాట్లాండ్ వెళ్తున్నానని ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఫోన్ చేశాడు. ఆమె కోసం బంగారు గొలుసు, యాపిల్ ఐఫోన్, ల్యాప్‌టాప్, ఐపాడ్ కొన్నానని చెప్పాడు. పెళ్లి బహుమతిగా పంపిస్తున్నానంటూ కొరియర్ పార్శిల్ చిత్రాన్ని వాట్సప్ చేశాడు. గత నెల 27న పార్శిల్ దిల్లీ విమానాశ్రయానికి చేరుతుందని చెప్పాడు. సరిగ్గా అదే రోజు ఆమెకు ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తన పేరు రాజీవ్‌కుమార్‌గా చెప్పుకొన్నాడు. దిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారిగా పేర్కొన్నాడు. పార్శిల్‌ను ఆమె చిరునామాకు పంపాలంటే పన్నులు చెల్లించాల్సి ఉందని చెప్పాడు. నిజమేనని నమ్మిన బాధితురాలు అయిదు విడతలుగా వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.10.89 లక్షలు పంపించింది. ఆ తర్వాత మరో రూ.5.72లక్షలు పంపించాలని కోరడంతో అనుమానం వచ్చి నిలదీయడంతో ఫోన్ స్విచ్‌ఆఫ్ అయిపోయింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
**ప్రవాస భారతీయుడికి ‘మాట్రిమోనీ’ వల
అమెరికా ఫ్లొరిడాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు పెళ్లి సంబంధం కోసం భారత్ మాట్రిమోనీలో నమోదు చేసుకున్నాడు. గత ఏప్రిల్‌లో ఓ యువతి అతడిని వాట్సప్ ద్వారా సంపద్రించింది. తన పేరు అర్చనగా పేర్కొంది. పది రోజులపాటు ఛాటింగ్ చేసిన అనంతరం ఇద్దరి మధ్య పెళ్లి చేసుకునేలా అవగాహనకు వచ్చారు. ఇదేక్రమంలో అతడు ఉండే ప్రాంతానికి సమీపంలోనే ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం ఉందని చెప్పింది. అక్కడికి మారేలా తనకు తెలిసిన వారితో మాట్లాడతానని నమ్మించింది. ఇందుకోసం 3,900ల డాలర్లు ఖర్చవుతాయని చెప్పడంతో బాధితుడు నమ్మాడు. ఆ డబ్బును ఆన్‌లైన్‌లో బదిలీ చేయాలన
బ్యాంకు ఖాతా నంబరు చెప్పింది. రెండు విడతలుగా 2,900 డాలర్లు(సుమారు రూ.2లక్షలు) బదిలీ చేసిన తర్వాత అనుమానం వచ్చిన బాధితుడు బ్యాంకు ఖాతా నంబరు గురించి ఆరా తీశాడు. ఆ ఖాతానంబరు హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లోని యాక్సిక్ బ్యాంకులో ఆంజనేయులు అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు తేలింది. దీనికితోడు ఆమె ఫోన్‌లో అందుబాటులో లేకుండా పోవడంతో మోసపోయానని గ్రహించి ఎల్‌బీనగర్‌లో ఉండే తన బంధువు ద్వారా సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సైబర్ దోపీడీల్లో కోట్ల రూపాయిలు పోతున్నాయి
Related tags :