DailyDose

వైజాగ్ లో అతిపెద్ద నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్

వైజాగ్ లో అతిపెద్ద నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్

ప్రకృతి అందాలకు, టూరిస్ట్ స్పాట్ లకు నెలవైన విశాఖ నగరం ఇప్పుడు మరో మరో ప్రత్యేకతను సంతరించుకుంది. దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ (తేలియాడే) సౌర ప్లాంట్‌ను నిర్మించి మరో రికార్డు సృష్టించింది. పర్యావరణానికి హాని చేయకుండా… రిజర్వాయర్‌లోని నీటిని కూడా ఆవిరి కానివ్వని ఈ ప్రాజెక్టులో ఎన్నో విశిష్టతలున్నాయి. నగర వాసులకు తాగునీటిని అందిస్తున్న మేఘాద్రిగడ్డను సోలార్ పవర్ ప్లాంట్ గా మార్చేసి అద్భుతమైన రీతిలో మలిచి జీవీఎంసీ గుర్తింపు పొందింది. రిజర్వాయర్ నీటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఓవైపు నీటిని ఆవిరికాకుండా అడ్డుకోవడం, రెండోవైపు సోలార్ పవర్ ఉత్పత్తి ద్వారా అవసరాలు తీర్చడం వంటివి ఏకకాలంలో జరగడం విశేషం. ఇక తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను జీవీఎంసీ షేర్ చేసింది. ఈ డ్రోన్ విజువల్స్ లో సౌర విద్యుత్ ను అందించే విద్యుత్ ప్యానెళ్లు నీటిపై తేలియాడడాన్ని గమనించవచ్చు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ పవర్ ప్లాంట్ నిర్మించామని, ఇది ప్రతి సంవత్సరం 4.2 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదని జీవీఎంసీ కమిషనర్ జి.లక్ష్మీశ తెలిపారు. అదనంగా, మేము సంవత్సరానికి 54,000 టన్నుల బొగ్గును ఆదా చేస్తున్నామన్న ఆయన.. సంవత్సరానికి 3,022 టన్నుల ఉద్గారాలను తగ్గిస్తున్నామని స్పష్టం చేశారు.

అయితే విశాఖపట్నం నగర జనాభా సుమారు 22 లక్షలు. వీరి విద్యుత్‌ అవసరాలతోపాటు నగర పరిధిలో వివిధ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, వీధి దీపాలకు రోజూ 40 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇదంతా ఈపీడీసీఎల్ (ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్) నుంచి కొనుగోలు చేయాలి. ఇది జీవీఎంసీకి ఆర్థిక భారమే అవుతోంది. ఈ భారాన్ని కొంతైనా తగ్గించుకునేందుకు సహజ ఇంధన వనరైన సౌర విద్యుత్‌ను తయారు చేసుకోవాలని ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.

విశిష్టతలు….
దేశంలోనే అతి పెద్ద తొలి ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేసిన జీవీఎంసీ… ముడసర్లోవలో రిజర్వాయర్‌లో రూ.11.37 కోట్లతో 2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టును నిర్మించింది. రూ.14.04 కోట్లతో మొత్తం 3 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించబడింది. 2019 డిసెంబర్ లో పనులు ప్రారంభించగా.. ఈ ఏడాది మార్చిలో పూర్తి చేశారు. తడిచినా తుప్పుపట్టని, జర్మన్‌ టెక్నాలజీ కలిగిన అత్యాధునిక ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు. రెండు మీటర్ల పొడవు, ఒక మీటర్‌ వెడల్పు కలిగిన 9,020 ఫోమ్‌ టెక్నాలజీతో కూడిన ఎల్లో ట్రూపర్స్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు.ఇదిలా ఉండగా గుర్‌గావ్‌కు చెందిన రెన్యూ సోలార్‌ సిస్టమ్‌ ప్రై. లిమిటెడ్‌ సంస్థ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టింది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(వీసీఐసీడీపీ)లో భాగంగా ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కి సంబంధించి అర్బన్‌ క్‌లైమేట్‌ చేంజ్‌ రెసిలియన్స్‌ ట్రస్ట్‌ ఫండ్‌(యూసీసీఆర్టీఎఫ్‌) నిధులతో ప్రాజెక్టు పూర్తి చేసింది.

12 ఎకరాల్లో… 40 శాతం నీరు ఆదా
సాధారణంగా 3 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ ను నిర్మించేందుకు 12 ఎకరాల విస్తీర్ణం అవసరమవుతుంది. కానీ మేఘాద్రి రిజర్వాయర్‌లో నీటి ఉపరితలంపై ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో 12 ఎకరాలు ఆదా చేయగలిగారు. రిజర్వాయర్‌లోని 0.1 శాతం విస్తీర్ణంలో అంటే 0.005 చ.కి.మీ విస్తీర్ణంలోనే ఈ సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్స్‌ నీటి ఉపరితలంపై ఉండటంతో రిజర్వాయర్‌లోని నీరు ఆవిరి కాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా 40 శాతం వరకూ నీటిని కూడా ఆదా చేస్తుంది.