*మీడియా తో ఎమ్మెల్యే RK చిట్ చాట్ రాజధాని పనులు ఆగిన విషయం తెలీదు. పనులు ఎందుకు నిలిపివేశారో కాంట్రాక్టర్ లు సమాధానం చెప్పాలి.
కాంట్రాక్టర్ లకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ఎక్సెస్ టెండర్ లపై అప్పుడే అంత ఆందోళన ఎందుకు.!? CRDA చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు…ఆ పోస్ట్ నాకు ఇస్తున్నారన్న విషయం తెలీదు. రకట్ట మీద అక్రమ నిర్మాణాలపై కోర్ట్ లో పోరాటం కొనసాగుతుంది.
మాజీ సీఎం చంద్రబాబు ఉండేది అక్రమ నిర్మాణం లోనే.! చంద్రబాబు ను ఆ నివాసం నుంచి కాళీ చేయిస్తాం. అమరావతి లో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు రాజధాని గురించి మాట్లాడుతున్నాడు. జగన్ తాడేపల్లి లో ఇల్లు కట్టుకున్నాడు. బాబు ఎక్కడ కట్టుకున్నాడు!?
*భాజపాలో చేరిన కొత్తపల్లి గీత
బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె మంగళవారం కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నేతృత్వంలో ఆమె కమలం గూటికి చేరారు. అంతేకాకుండా గత ఏడాది తాను స్థాపించిన జనజాగృతి రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
* రేపు దిల్లీకి సీఎం జగన్, కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం దిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో రేపు మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరగబోయే సమావేశంలో వీరు పాల్గొననున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మేరకు ఆయన ఆయా పార్టీలకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో వైకాపా నుంచి జగన్, తెరాస నుంచి కేటీఆర్ వెళ్లాలని నిర్ణయించారు. తెదేపా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
* అందరూ హోదానే కోరుకున్నారు- అచ్చెన్నాయుడు
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు కోట్ల మంది ప్రజలు, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు హోదానే కోరుకున్నాయని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం అన్నివిధాల అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా హోదా కావాలనే ఉద్దేశంతోనే వైఎస్పార్ కాంగ్రెస్ పార్ఠీకి అధికారం ఇచ్చారని తాము భావిస్తున్నామని.. అందుచేత ఆ పార్టీ తప్పకుండా ప్రత్యేక హోదా సాధించాలని అచ్చెన్నాయుడు సూచించారు. ఇది తన సలహా మాత్రమేనని అన్నారు.
* చంద్రబాబును అక్కడి నుంచి ఖాళీ చేయిస్తాం
కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న నివాసం నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఖాళీ చేయిస్తామని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం శాసనసభ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన .. కరకట్టపై అక్రమ నిర్మాణాలకు సంబంధించి కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు .. రాజధానిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని పనులు ఆగిన విషయం తనకు తెలియదని చెప్పారు. పనులు ఎందుకు ఆపేశారో గుత్తేదారులే సమాధానం చెప్పాలన్నారు. గుత్తేదారులకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. సీఆర్డీఏ ఛైర్మన్‌గా సీఎం ఉంటారని, ఆపదవి తనకు ఇస్తారన్న విషయం తెలియదని ఆర్కే అభిప్రాయపడ్డారు.
* చంద్రబాబును అక్కడి నుంచి ఖాళీ చేయిస్తాం
కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న నివాసం నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఖాళీ చేయిస్తామని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం శాసనసభ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన .. కరకట్టపై అక్రమ నిర్మాణాలకు సంబంధించి కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు .. రాజధానిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని పనులు ఆగిన విషయం తనకు తెలియదని చెప్పారు.
* సీఎం రమేశ్, విజయసాయి సుదీర్ఘ మంతనాలు
లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన వైకాపా నేత విజయసాయిరెడ్డి, తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌లు పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘ మంతనాలు జరపడం ఆకర్షించింది. తొలుత సీఎం రమేశ్ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉండగా, విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకొని కొద్దిసేపు ఎవరి సీట్లలో వారే కూర్చుండి పోయారు. తర్వాత విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేశ్ పక్కన కూర్చొన్నారు. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చినా ఆయన వారిద్దరికీ కొంత దూరంలో కూర్చుండిపోయారు. ఆ తర్వాత కూడా సీఎం రమేశ్, విజయసాయిరెడ్డిలు చర్చల్లో మునిగిపోయారు. సమావేశానంతరం ఈ చర్చల సారాంశం గురించి విజయసాయిరెడ్డిని విలేకర్లు అడగగా ‘‘మీ హయాంలో ఏమేం చేశారో చెప్పమని రమేశ్‌ను అడిగాను’’ అని బదులిచ్చారు.
*20న పోలవరానికి సీఎం జగన్!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ నెల 20న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. తొలిసారి ఆయన పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లబోతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జలవనరులశాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో త్వరలోనే తాను పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని జగన్ చెప్పారు. ప్రత్యక్షంగా పరిశీలించి పూర్తిస్థాయిలో సమీక్షిద్దామని అన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 20న పోలవరం రానున్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా జలవనరులశాఖ ఉన్నతాధికారులకు తెలియజేశారు.
*మాజీ ఎంపీలు వీహెచ్, హర్షకుమార్ అరెస్టు
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, హర్షకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు గతంలో కొందరు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం లారీలో అంబేడ్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్లీ అదే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ సంఘాల నాయకులు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వీహెచ్, హర్షకుమార్తో పాటు అంబేడ్కర్ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షుడు గుడిమల్ల వినోద్కుమార్ను అరెస్టు చేసి బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు. నేతల అరెస్టు సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేడ్కర్ విగ్రహంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు.
*భాజపాకు కొత్త శక్తి!
భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జేపీ నడ్డా(58)ను ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. సోమవారమిక్కడ జరిగిన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలిగా పేరొందిన పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని సమావేశం అనంతరం పార్టీ మాజీ అధ్యక్షుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. ‘భాజపా సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు’ అని రాజ్నాథ్ ట్వీట్ చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో భాజపా పలు ఎన్నికల్లో విజయం సాధించిందని, ప్రధాని మోదీ ఆయనను హోంమంత్రిగా నియమించిన తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని ఇతరులెవరికైనా అప్పగించాలని అమిత్షాయే చెప్పారన్నారు.
*ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిపై చర్యలు?
కాంగ్రెస్ పార్టీపైనా, నాయకత్వంపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై క్రమశిక్షణ చర్యలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సోమవారం గాంధీభవన్లో కమిటీ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన భేటీ అయింది. కమిటీ సభ్యులు కమలాకర్రావు, శ్యాంమోహన్, సీజే శ్రీనివాస్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాజగోపాల్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగులు, వార్త పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించారు.
*అవినీతికి మారు పేరు కాంగ్రెస్
అవినీతికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీ నేత భట్టి విక్రమార్క ప్రాజెక్టుల్లో అవినీతి గురించి మాట్లాడడం సిగ్గుచేటని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత-చేవెళ్ల పేరుతో కాంగ్రెస్ నేతలు రూ.కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యద్భుతమైన రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే దానిని ఏ మాత్రం చూడకుండా భట్టి అడ్డగోలుగా మాట్లాడడం దారుణమని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గాలివాటున నాలుగు స్థానాలు గెలిచిన భాజపా నేతలు మిడిసిపడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా ఆ పార్టీ నేతలకు జ్ఞానోదయం కాలేదన్నారు.
*30 లక్షల సభ్యత్వమే లక్ష్యం
తెలంగాణలో నాలుగు లోక్సభ స్థానాల గెలుపుతో దూకుడు ప్రదర్శిస్తున్న భాజపా సభ్యత్వ నమోదులోనూ దానిని కొనసాగించాలని భావిస్తోంది. రాష్ట్రంలో 30 లక్షల సభ్యులను చేర్పించాలని పార్టీ సభ్యత్వ నమోదు బాధ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర సభ్యత్వ నమోదు బాధ్యుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, సహ బాధ్యుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లుకు సూచించారు. దిల్లీలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
*కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదు
నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలయ్యాయని, మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తుంటే నాయకులు కళ్లుమూసుకున్నారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐడీసీ) ఛైర్మన్ ఈద శంకర్రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇంజినీర్లా శాసనసభలో వివరిస్తే వినలేదని, కాళేశ్వరం ప్రవాహం, ఎత్తిపోతలపై వారికి కనీస అవగాహన లేదన్నారు.
*టీఆర్టీ ఉత్తీర్ణులకు నియామక పత్రాలివ్వాలి
గత అయిదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఇవ్వని చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి విమర్శించారు. టీఆర్టీలో ఉత్తీర్ణులైన వారికి వెంటనే నియామకపత్రాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడారు.మంగళవారం జరిగే మంత్రిమండలి సమావేశంలోనైనా 8,792 మంది టీఆర్టీ ఉత్తీర్ణులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని.. లేకుంటే వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
*ఈవీఎంలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి: మొయిలీ
ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ మరోమారు సందేహం వెలిబుచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ఈ యంత్రాలను వినియోగించాలా? లేక మళ్లీ బ్యాలట్ పత్రం విధానాన్ని తీసుకురావాలా? అనే విషయాన్ని నిర్ణయించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు బ్యాలట్ పత్రం విధానాన్నే అవలంబించాలని, ఈవీఎంల పనితీరుపై సందేహాలు ఉన్నందున వాటిని వినియోగించరాదని మొయిలీ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అనుమానాల నివృత్తికి ఎలాంటి చర్యలు చేపట్టనందున ఎన్నికల సంఘం ప్రవర్తనపైనా అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు.
*పార్టీ మారడం లేదు: జేసీ దివాకర్రెడ్డి
‘నేను పార్టీ మారడం లేదు.. రాజకీయాల్లో నుంచి విరమించా అంటే భాజపాలో చేరతానని మీరెలా అడుగుతారు?’ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి విలేకరులను ఉద్దేశించి అన్నారు. సచివాలయంలో సోమవారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. కొంతమందితో భాజపా టచ్లో ఉందనేది వాస్తవమని, అయితే వాళ్లెవరూ తనను సంప్రదించలేదన్నారు. భాజపా బలోపేతం కోసం ఆ పార్టీ నేతలు ప్రయత్నం చేయడం తప్పు కాదని జేసీ వ్యాఖ్యానించారు.
*. మొబైల్‌లో చూస్తూ ప్రమాణం చేసిన రేవంత్
లోక్‌సభలో కొత్త ఎంపీల ప్రమాణస్వీకారాల పర్వం కొనసాగుతోంది. ఆంగ్ల అక్షర క్రమం ప్రకారం తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారం మంగళవారం జరిగింది. రాష్ట్రం నుంచి తొలుత అదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు, ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తదితరులు ప్రమాణం చేశారు.అయితే ఎంపీ రేవంత్ రెడ్డి.. లోక్‌సభ అధికారులు ఇచ్చిన ప్రమాణ పత్రాన్ని తిరస్కరించారు. తన మొబైల్‌లో ప్రమాణపత్రాన్ని చూస్తూ తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి, పోతగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్, కవిత మాలోత్, నామా నాగేశ్వరరావు తదితరులు కూడా తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేసే సమయంలో వారి వెనుకే కూర్చున్న హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బల్ల చరిచి అభినందించారు. హైదరాబాద్ ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణస్వీకారం చేసే సమయంలో సభ్యులు వందేమాతరం, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేయడంతో సభ మారుమోగింది.