శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 21వ సంస్థాపన దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రి వేదాశ్వీరచనంతో మొదలయింది.చమర్తి రాజు ప్రారంభోపన్యాసం చేస్తూ గత రెండు దశాబ్దాలుగా చేసిన ప్రయాణాన్ని, సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను ఆహూతులతో పంచుకున్నారు.
ప్రముఖ వైణికులు ఫణి నారాయణ వీణానాద కచ్చేరితో సాంస్కృతిక కార్యక్రమం మొదలయింది. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ ఫణి నారాయణని ఘనంగా సత్కరించారు.
అమెరికా దేశంలో తొలిసారిగా వేదాంతం రాఘవ, వేదాంతం వెంకటాచలపతిల నిర్దేశకత్వంలో కూచిపూడి యక్షగాన కార్యక్రమం, “ఉషాపరిణయం ” ప్రదర్శించారు. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలతో చేయించిన ఈ యక్షగానం 2గంటల సేపు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ యక్షగానం సాకల్యం కావడానికి పట్టుదలతో కృషిచేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యురాలు చింతలపూడి జ్యోతికి ప్రత్యేక అభినందనలు అందుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని అచ్చ తెలుగు భోజనంతో ముగించారు. ప్రత్యేకంగా తెప్పించిన అరటి ఆకుల్లో తెలుగు భోజనాన్ని వడ్డించారు.
సంస్థలో కీలక పాత్రలు పోషించిన సిలికానాంధ్ర ప్రతినిధులు దిలీప్ కొండిపర్తి, దీనబాబు కొండుభట్ల, మాడభూషి విజయసారధి, తనుగుల సంజీవ్, భారత కాన్సులేట్ జనరల్ టి.నాగేంద్రప్రసాద్, అమెరికా పర్యటనలో ఉన్న బైలూరు రామకృష్ణ మఠం అధిపతి స్వామీ వినాయకానంద, సిలికానాంధ్ర భవనానికి దాత, విశ్రాంత వైద్యులు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా సిలికానాంధ్ర 21వ వార్షిక వేడుకలు

Related tags :