ప్రవాసుల కుటుంబ సభ్యులకు ఇచ్చే ఫ్యామిలీ వీసాలపై కువైత్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఆరు గవర్నరేట్ల పరిధిలో ఫ్యామిలీ వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అంతర్గత మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, దీని నుంచి వైద్యులతో పాటు ఇతర కొన్ని కేటగిరీలకు చెందిన నిపుణులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.ఇంతకు ముందు తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు వీసాలు జారీ చేసిన వారికి ఈ నిర్ణయం వర్తించదని పేర్కొన్నారు. రెసిడెన్సీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. విజిట్ వీసా విధానాలు పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తదుపరి నోటీసులు వచ్చేవరకు ఆరు గవర్నరేట్ల పరిధిలో ఫ్యామిలీ వీసాల జారీని నిలిపివేయాలని రెసిడెన్సీ అఫైర్స్ విభాగం స్పష్టం చేసింది.