DailyDose

పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణంలో హత్యకోణం.. 59 రోజుల తరువాత వెలుగులోకి…

పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణంలో హత్యకోణం.. 59 రోజుల తరువాత వెలుగులోకి…

కాకినాడలో రెండు నెలల క్రితం  జరిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మృతి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అతనిది హత్య అని, భార్యే ప్లాన్ ప్రకారం అంతమొందించిందని తేలింది

కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చి.. సహజ మరణంగా చిత్రీకరించింది. కుటుంబ సభ్యులు, బంధువులు అదే నిజమని నమ్మారు. తాము బయటపడ్డామని నిందితులు ఊపిరి పీల్చుకున్నారు. సెల్ ఫోన్ లోని సమాచారంతో మృతుడి తండ్రికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విచారణ చేయగా, గుట్టు బయట పడింది. కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ అక్బర్ ఆజాం ఈ ఏడాది జూన్ 23న మరణించారు. హత్య అని అంచనాలతో యాభై తొమ్మిది రోజుల తర్వాత శవపరీక్ష చేశారు.  విశ్వసనీయ సమాచారం మేరకు..  పీపీ అక్బర్ ఆజాం (50)మొదటి భార్య పదిహేనేళ్ల కిందట ఆడబిడ్డకు జన్మనిచ్చిన మరణించింది.

తర్వాత ఆయన యానాంకు చెందిన అహ్మద్దున్నీసా బేగం (36)ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం.  తల్లిదండ్రులు కాకినాడలో ఉంటున్నారు.  గతంలో ఆయన తన భార్యకు కొత్త ఫోన్ కొనిచ్చి, అప్పటిదాకా ఆమె వాడిన పాత ఫోనును తన తండ్రి హుస్సేన్కు ఇచ్చాడు. కొడుకు మరణాంతరం ఇటీవల హుస్సేన్ ఆ ఫోన్ లోని పాత వాట్సాప్ చాటింగ్ లు, వాయిస్ మెసేజ్ లను గమనించారు. అందులో ఆజాం నివాసముండే అపార్ట్మెంట్లో ఫై ఫ్లాట్లో ఉంటున్న రాజస్థాన్కు చెందిన రాజేష్ జైన్ తో పాటు మెడికల్ రిప్రజెంటేటివ్ కిరణ్ తో కోడలు అహ్మద్దున్నీసా జరిపిన సంభాషణలు వెలుగుచూశాయి. వాటి ఆధారంగా తన కొడుకుది హత్య ఏమోనని అనుమానించిన హుస్సేన్ ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లోరోఫామ్ తో మత్తిచ్చి…పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. జూన్ 23న అహ్మదున్నీసా తన భర్తకు ముందుగా నిద్రమాత్రలు ఇచ్చింది. గాఢనిద్రలోకి వెళ్లగా మెడికల్ రిప్రజెంటేటివ్ కిరణ్ తన వెంట తెచ్చిన క్లోరోఫామ్ ను ఓ గుడ్డలో వేసి దాన్ని ఆజాం ముక్కు వద్ద గట్టిగా అదిమి పెట్టాడు. ఇందుకు భార్య సహకరించింది. ఆ సమయంలో రాజేష్ చైన్ ఇంటి బయట కాపలాగా ఉన్నాడు. మోతాదు ఎక్కువ కావడంతో ఆజా మరణించారని పోలీసులు విచారణలో తేలింది. తనకు సన్నిహితంగా మెలిగిన యువకుల సహాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించి హత్య కేసుగా నమోదు చేశారు. శనివారం జీజీహెచ్ ఫోరెన్సిక్ వైద్యుల బృందం శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించింది. అహ్మద్దున్నీసా, కిరణ్, రాజేంద్ర నిందితులుగా పేర్కొన్న పోలీసులు ముగ్గురిని విచారిస్తున్నట్లు సమాచారం.