WorldWonders

ఇండియా ఘరానా కార్ల దొంగ అరెస్ట్

ఇండియా ఘరానా కార్ల దొంగ అరెస్ట్

దేశంలో పేరు మోసిన ఘరానా కార్ల దొంగను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశ వ్యాప్తంగా ఐదు వేలకుపైగా కార్లను అతడు చోరీ చేసినట్లు తెలిపారు. ఢిల్లీలోని కాన్పూర్‌ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల అనిల్ చౌహాన్ గతంలో ఆటో డ్రైవర్‌గా జీవించాడు. 1995 నుంచి అతడు నేరబాట పట్టాడు. గత 27 ఏళ్లలో దేశ వ్యాప్తంగా సుమారు ఐదు వేలకుపైగా కార్లను దొంగిలించాడు. ఈ క్రమంలో కొందరు డ్రైవర్లను హత్య చేశాడు. ఎక్కువగా మారుతీ 800 కార్లను అనిల్‌ చోరీ చేశాడు. దొంగిలించిన కార్లను జమ్ముకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలతోపాటు నేపాల్‌కు తరలించి అమ్మేవాడు. వీటి ద్వారా కోట్లు సంపాదించాడు. ఢిల్లీ, ముంబై, అస్సాంలో పలు ఆస్తులు కొన్నాడు. ప్రస్తుతం అస్సాంలో నివసిస్తూ విలాసవంత జీవితం గడుపుతున్నాడు. ఈ ఘరానా కార్ల దొంగకు ముగ్గురు భార్యలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. కాగా, అనిల్‌ చౌహాన్‌ తాజాగా అక్రమంగా ఆయుధాలను స్మగ్లింగ్‌ చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన తీవ్రవాద సంస్థలకు వీటిని సరఫరా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కదలికలపై ఢిల్లీ పోలీసులు నిఘా పెట్టారు. దేశ్ బంధు గుప్తా రోడ్ ఏరియాలో అనిల్‌ ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో సెంట్రల్‌ ఢిల్లీ పోలీసులు అతడ్ని చాకచక్యంగా సోమవారం అరెస్ట్‌ చేశారు. ఆరు పిస్టళ్లు, బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు దేశంలోనే పేరు మోసిన కార్ల దొంగ అనిల్‌పై 180 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పలుసార్లు అరెస్ట్‌ కూడా అయ్యాడని చెప్పారు. 2015లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేతో కలిసి ఉండగా పట్టుబడటంతో ఐదేళ్లు జైల్లో ఉండి 2020లో విడుదలయ్యాడని వివరించారు. అస్సాంలో రాజకీయ నేతల అండతో ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా పొందినట్లు వెల్లడించారు. అతడు భారీగా ఆస్తులు కూడబెట్టడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.