ScienceAndTech

అమెరికా పేరు చెప్పి కోటి రూపాయిల మోసం

అమెరికా పేరు చెప్పి కోటి రూపాయిల మోసం

విజ‌య‌వాడ‌లోని దేవీన‌గ‌ర్‌కు చెందిన ఓ యువ‌తి ఎంటెక్ పూర్తి చేసింది. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తోంది. పెండ్లి సంబంధాలు చూస్తుండ‌టంతో త‌న ప్రొఫైల్‌ను ఒక మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అది చూసి కె.శ్రీకాంత్ అనే యువ‌కుడు ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆమెకు ఫోన్ చేశాడు. త‌న ఫ్యామిలీ విశాఖ‌ప‌ట్నంలో ఉంటుంద‌ని.. తాను అస్ట్రాజెనికా ఫార్మా కంపెనీలో ప‌నిచేస్తున్నాన‌ని చెప్పాడు. శ్రీకాంత్ డీటైల్స్‌, అత‌ని తీరు న‌చ్చ‌డంతో అత‌నితో పెండ్లికి స‌ద‌రు యువ‌తి అంగీక‌రించింది. ఈ క్ర‌మంలో ప్రాజెక్ట్ నిమిత్తం అమెరికా వెళ్తున్నాన‌ని.. త్వ‌ర‌లోనే పెండ్లి చేసుకుంటున్నాం కాబట్టి అక్క‌డి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాల‌ని యువ‌తికి శ్రీకాంత్ సూచించాడు. పాస్‌పోర్టు, వీసా తీసుకోవాల‌ని ఇందుకోసం సిబిల్ స్కోర్ 842 పాయింట్ల వ‌ర‌కు ఉండాల‌ని న‌మ్మించాడు. శ్రీకాంత్ మాయ‌మాట‌లు న‌మ్మిన యువ‌తి.. సిబిల్ స్కోర్ పెంచుకునేందుకు వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు అప్లై చేసింది. మైక్రోఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకుంది. ఆమె తీసుకోవ‌డంతో పాటు త‌న తండ్రి, సోద‌రుడితో కూడా ప‌లు సంస్థ‌ల నుంచి రుణాల కోసం అప్లై చేయించింది. అలా వ‌చ్చిన రూ.1.06కోట్ల‌ను శ్రీకాంత్ సూచ‌న మేర‌కు హ‌రీశ్ సంపంగి అనే వ్య‌క్తి ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. అప్పట్నుంచి శ్రీకాంత్ వాళ్ల ఫోన్ల‌కు స‌మాధానం ఇవ్వ‌డం మానేశాడు. ఏమైందా అని ఆలోచిస్తున్న స‌మ‌యంలోనే తెలంగాణ రాష్ట్ర సైబ‌ర్ సెల్ పోలీసుల నుంచి యువ‌తికి ఒక ఫోన్ కాల్ వ‌చ్చింది. శ్రీకాంత్ గురించి ఆరా తీసిన పోలీసులు.. అత‌ను ఒక సైబ‌ర్ నేర‌స్తుడు అని చెప్పారు. దీంతో మోస‌పోయామ‌ని గ్ర‌హించిన స‌దరు యువ‌తి ఈ నెల 15న‌.. విజ‌య‌వాడ సైబ‌ర్ క్రైం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.