ప్రపంచంలోనే అగ్రశ్రేణి విద్యాసంస్థలలో మూడు భారతీయ సంస్థలకు స్థానం లభించింది. ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు.. ఈ మూడు సంస్థలు ప్రతిష్ఠాత్మకమైన క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకులలో అగ్రశ్రేణి 200 సంస్థలలో ఉన్నాయి. ‘క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2020’ని లండన్లో బుధవారం విడుదల చేశారు. అగ్రశ్రేణి 1000 ర్యాంకులలో భారతదేశానికి చెందిన ఓపీ జిందాల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం (జేజీయూ) సహా 50 కొత్త సంస్థలున్నాయి. దీంతో స్థాపించిన అతి తక్కువ కాలం (పదేళ్లు)లోనే ఈ ప్రతిష్ఠాత్మక ర్యాంకు పొందిన విశ్వవిద్యాలయంగా ఈ సంస్థ నిలిచింది. అగ్రశ్రేణి 400 జాబితాలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పుర్, ఐఐటీ కాన్పుర్, ఐఐటీ రూర్కీ ఉన్నాయి. గత సంవత్సరం 472వ ర్యాంకు సాధించిన ఐఐటీ గువాహటి ఈసారి 491తో సరిపెట్టుకుంది. దిల్లీ విశ్వవిద్యాలయం గత సంవత్సరం (487) కంటే ఈసారి (474) మెరుగుపడింది. అగ్రశ్రేణి 200 సంస్థలలో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు ఉండటం చాలా గర్వకారణమని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ట్వీట్ చేశారు. ఐఐటీ ఖరగ్పుర్ గత సంవత్సరం కంటే 14 స్థానాలు మెరుగుపడినందుకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు. ఈ ర్యాంకులలో ఇంకా జామియా మిలియా ఇస్లామియా, జాదవ్పుర్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ కూడా ఉన్నాయి.
మన ఐఐటీలకు ఘనమైన చోటు
Related tags :