Movies

గంట కూడా నిద్రపోలేదు

Puja Hegde Says She Didnt Even Sleep For An Hour On Some Shootings

కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోతే… అమ్మాయిలు మరింత అందంగా ఉంటారని చెబుతుంటారు. గ్లామర్గా కనిపించాలంటే నిద్ర తప్పనిసరి. కానీ పూజా హెగ్డే మాత్రం మరోలా అంటోంది. ‘నేను తక్కువ తిని, తక్కువ నిద్రపోతే అప్పుడు ఇంకాస్త అందంగా కనిపిస్తా’ అంటోంది. ఈ వేసవిలో ‘మహర్షి’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది పూజ. ప్రస్తుతం అల్లు అర్జున్తో కలసి నటిస్తోంది. పూజ మాట్లాడుతూ ‘‘సెట్లో ఉన్నప్పుడు ఆకలి, నిద్ర.. వీటి గురించి అస్సలు పట్టించుకోను. ఉదయం ఏడింటికి సెట్కి వెళ్లి, అర్ధరాత్రి రెండింటి వరకూ పని చేసిన రోజులున్నాయి. ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ నేను గంట సేపు కూడా నిద్రపోని సందర్భాలున్నాయి. మహా అయితే రోజుకి నాలుగు గంటలు పడుకుంటా. నిద్ర లేకపోయినా సరే… మరుసటి రోజు ఎలాంటి అలసట నాలో కనిపించదు. దానంతటికీ కారణం పనిపై నాకున్న ప్రేమే. జయాపజయాలతో సంబంధం లేకుండా నా వృత్తిని నేను గౌరవిస్తాను. ఆ గౌరవమే నన్ను నడిపిస్తోంద’’ని చెప్పింది.