ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా యువకుడు మృతి చెందారు. ఐరాల మండలం పొలకల పంచాయతీ కొండకిందయల్లంపల్లె గ్రామానికి చెందిన సాయిరోహిత్ (28) బీటెక్ తర్వాత ఉన్నత చదువులకోసం 2016లో మెల్‌బోర్న్‌కు వెళ్లారు. సాయి ప్రస్తుతం పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం విధి నిర్వహణ నిమిత్తం మెల్‌బోర్న్ నుంచి వేరే ప్రాంతానికి కారులో బయలుదేరారు. గుల్‌బర్ వ్యాలీ హైవేలోని సియోమోర్ ప్రాంతంలో ఉదయం మంచు ఎక్కువగా కురుస్తుండటంతో దారి కనిపించలేదు. దీంతో సాయిరోహిత్ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సాయిరోహిత్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమద సమయంలో కారులో ఒక్కడే ఉండటంతో.. ఆయన వివరాలు స్థానికులకు తెలియ లేదు. దీంతో వారు ఈ ప్రమాద విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీన్ని గమనించిన ఆస్ట్రేలియా తెలుగు సంఘం మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. సాయిరోహిత్ మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించడానికి 14 వేల ఆస్ట్రేలియా డాలర్లు ఖర్చవుతుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి సన్నాహాలు చేస్తుంది. వారం రోజుల్లో మృతదేహం స్వగ్రామానికి రానున్నట్లు సమాచారం. కాగా, సాయిరోహిత్ తండ్రి మోహన్‌నాయుడు 2017లో మృతిచెందారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లి కన్నీరు మున్నీరవుతోంది.