సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి అవకాశాల్ని పొందడంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదని, అయితే ప్రతిభావంతురాలైన నటిగా నిరూపించుకోవడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పింది అందాల భామ జాన్వీకపూర్. ఇటీవలే ఈ సొగసరి ‘మిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ఆమె అభినయం బాగుందనే ప్రశంసలొస్తున్నాయి.ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది జాన్వీకపూర్. జీవితంలోని ప్రతి అడుగులో అంతా శుభమే జరగాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుందని చెప్పింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన నటన ద్వారా ప్రేక్షకుల హృదయాల్ని గెల్చుకుంటానని విశ్వాసం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘మున్ముందు నన్ను కొత్త పాత్రల్లో చూస్తారు.సినిమాను నేను ఎంతగానో ప్రేమిస్తా. సవాళ్లతో కూడిన పాత్రల్లో నటించాలనే తపనతో పనిచేస్తున్నా. భవిష్యత్తులో గొప్ప స్థానంలో ఉంటాననే నమ్మకం ఉంది’ అని చెప్పింది. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ గుంజన్ సక్సేనా, గుడ్‌లక్ జెర్రీ చిత్రాల్లో చక్కటి అభినయంతో పేరు తెచ్చుకుంది.