కార్తిక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కనిపిస్తుంది. 40 రోజులపాటు కఠిన దీక్ష సాగించిన ‘స్వాములు’ ఇరుముడి ధరించి శబరిమలను దర్శించుకుంటారు. స్వామి దర్శనానికి ముందు 18 మెట్లు ఎక్కాలి. దీన్నే పదునెట్టాంబడి అంటారు. పవిత్రమైన ఆ మెట్ల వెనుక పురాణ కథనం ఉంది. అఖండ సాలగ్రామ శిలతో వీటిని పరశురాముడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శబరిమలను పరశురామ క్షేత్రం అంటారు. ఈ మెట్లను మానవుని స్థూల, సూక్ష్మ శరీరాలకు ప్రతీకగా చెబుతారు. అయ్యప్పస్వామి మణికంఠునిగా 12 ఏండ్లు పందలం రాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తర్వాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో కొలువుదీరడానికి వీలుగా నాలుగు వేదాలు, రెండు శాస్ర్తాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం దేవతా రూపాలు దాల్చి పద్దెనిమిది మెట్లుగా రూపుదాల్చుకోగా, అయ్యప్ప వాటిమీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని చేరుకున్నాడని పురాణ కథనం. ఈ మెట్లను అధిరోహించడం ద్వారా అవిద్య, అజ్ఞానం తొలగిపోయి.. స్వామి అనుగ్రహం లభిస్తుందని దీక్షధారుల నమ్మకం.