Politics

నాగపూర్ లో సందడి చేసిన మోడీ

మెట్రోని ప్రారంబించి..సామాన్య ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసిన మోదీ

నాగ్‌పూర్‌: దేశంలో ఆరో ‘వందే భారత్‌(Vande Bharat)’ రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ల మధ్య సేవలందించే ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు.నాగ్‌పూర్‌(Nagpur) ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా రైల్లో ప్రయాణించిన ప్రధాని.. ప్రయాణికులు, రైల్వే సిబ్బందితో ముచ్చటించారు. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ప్రధాని మోదీ(PM Modi).. నాగ్‌పూర్‌కు చేరుకున్నారు.
ఈ క్రమంలోనే నగరంలో రూ.8650 కోట్లతో నిర్మించిన మెట్రో ఫేస్‌ 1ని ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సాధారణ ప్రయాణికుడిలా టికెట్‌ కొనుగోలు చేసి.. ఫ్రీడం పార్క్‌, ఖప్రీ స్టేషన్‌ల మధ్య మెట్రోలో ప్రయాణించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం మెట్రో ఫేస్‌ 2కు శంకుస్థాపన చేశారు. రూ.6700 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
అంతకుముందు నాగ్‌పూర్‌ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తదితరులు స్వాగతం పలికారు. నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌ ప్రారంభోత్సవం, రూ.950 కోట్లతో నాగ్‌పూర్‌, అజని రైల్వేస్టేషన్‌ల అభివృద్ధి పనులు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వన్‌ హెల్త్‌కు శంకుస్థాపన తదితర కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. అనంతరం గోవా బయల్దేరి.. అక్కడ నిర్మించిన మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ ప్రారంభించనున్నారు.