స్టార్డమ్లో చిక్కుకుపోవడం వల్లే హీరోలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడం లేదన్న విమర్శలను తాను ఒప్పుకోనంటున్నది బాలీవుడ్ తార కాజోల్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘సలామ్ వెంకీ’ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి స్పందన తెచ్చుకుంటున్నది. కాజోల్ మాట్లాడుతూ…‘ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోవడం వల్లే మన హీరోలు ప్రయోగాత్మక చిత్రాలు చేయడం లేదంటే నేను ఒప్పుకోను. ఎవరెన్ని మాట్లాడినా సినిమా అనేది వ్యాపారం. ఇక్కడ కోట్లాది రూపాయల పెట్టుబడులు ఉంటాయి.
సినిమా తలరాతకు హీరోనే బాధ్యుడు. ఆ చిత్రాన్ని తప్పకుండా విజయవంతం చేయాలనే ఒత్తిడి మన స్టార్ హీరోలపై ఉంటుంది. దాంతో వారికి మరో మార్గం లేక ప్రయోగాల జోలికి పోకుండా ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్నారు. వాళ్లకున్న పరిమితులను మనం అర్థం చేసుకోవాలి’ అని చెప్పింది