ఇకపై శ్రీలంకకు (Srilanka travel restrictions) వెళ్లాలనుకునేవారికి ఆ ద్వీప దేశం తీపికబురు చెప్పింది. పర్యాటక దేశంగా మంచి గుర్తింపు పొందిన శ్రీలంక అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన కొవిడ్-19 ఆంక్షల్ని తొలగించింది. దీంతో రాబోయే రోజుల్లో ఎవరైనా ఆ దేశానికి హ్యాపీగా వెళ్లొచ్చని స్పష్టం చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఇకపై ఆ దేశాన్ని సందర్శించాలనుకునే ప్రయాణికులు COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదు. అలాగే అక్కడికి వెళ్లేముందు కరోనా టెస్టు నెగిటివ్ రిపోర్ట్ కూడా తీసుకెళ్లాల్సిన పనిలేదు. ఇదే విషయంపై తాజాగా మాట్లాడిన శ్రీలంక డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అసేల గుణవర్దన.. 2021లో కొవిడ్-19 నిబంధనలకు సంబంధించి జారీ చేసిన సర్క్యులర్‌ను ఎత్తివేశామని చెప్పారు. దీంతో ఇకపై శ్రీలంకకు వెళ్లాలనుకునేవారికి కొవిడ్-19 నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. ఇది డిసెంబర్ 7 నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపారు. అయితే, అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరైనా శ్రీలంకకు చేరుకున్న తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలితే 7 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేశారు.పాజిటివ్‌గా తేలిన వారు ప్రైవేట్ ఆసుపత్రిలో లేదా ఏదైనా హోటల్‌లో లేదా ఏదైనా నివాస స్థలంలో ఒంటరిగా ఉండటం తప్పనిసరని చెప్పారు. తద్వారా ఇతరులు కరోనా బారిన పడకుండా ఉంటారన్నారు. కాగా, 2021లో కోవిడ్ కేసులు భారీగా పెరిగిన సందర్భంలో శ్రీలంక విదేశీ ప్రయాణికులపై ఎత్తేసిన ఆంక్షలు మళ్లీ విధించింది. అయితే, టీకా వేసుకున్న ప్రయాణికులకు, ప్రి అరైవల్ నెగిటివ్ రిపోర్ట్ కలిగిన వారికి మినహాయింపు నిచ్చింది. ఇప్పుడు తాజాగా మొత్తం ఆంక్షల్ని తొలగించింది.