కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది : మంత్రి రోజా
అమరావతి: చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలైపోతున్నారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా విమర్శించారు.
తాడేపల్లిలో రోజా మీడియాతో మాట్లాడారు.కందుకూరులో ఇరుకు సందులో సభ పెట్టి ఎనిమిది మంది మృతికి చంద్రబాబు కారణమయ్యారని ఆమె ఆరోపించారు.
గుంటూరులో కానుకల పేరుతో ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని మంత్రి రోజా విమర్శించారు.
చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టనబెట్టుకున్నారన్నారు. కందుకూరు సభలో ఎనిమిది మృతికి చంద్రబాబే కారణమని మంత్రి రోజా విమర్శించారు. పేదవాడి ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అని మంత్రి రోజా ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని మంత్రి రోజా చెప్పారు. ఈ ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి రోజా స్పష్టం చేశారు. చంద్రబాబు తప్పుడు మాటలను ప్రజలు పట్టించుకొనే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని మంత్రి తెలిపారు.