‘అన్‌స్టాపబుల్ 2’ షో పైరసీపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పైరసీని నిలువరించేందుకు జాండో ఆర్డర్‌ను తీసుకుంది. ఈ మేరకు ‘ఆహా’ ప్రతినిధులు ఓ సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆహా యాప్ లో వస్తోన్న ‘అన్‌స్టాపబుల్ 2’ కంటెంట్ పైరసీకి గురవుతోందని.. దానిని నిలువరించేందుకు కోర్టు నుంచి జాండో ఆర్డర్ తీసుకున్నట్టు ఆహా ప్రతినిధులు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ‘ఆహా’ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్, లీగల్ టీం సభ్యుడు ఆశిష్ ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా.. దేశంలోనే మొట్టమొదటి సారిగా దిల్లీ హైకోర్టు నుంచి జాండో ఆర్డర్ పొందినట్టు ఆశిష్ తెలిపారు. దీని ప్రకారం అన్‌స్టాపబుల్ కంటెంట్ పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు. జాండో ఆర్డర్‌తో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసి.. వారి ద్వారా పైరసీ చేసే వారిపై చర్యలు తీసుకోనుందని అన్నారు. ఆయా వెబ్ సైట్లను బ్యాన్ చేయటం సహా మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.