ఓ రామ నీ నామం ఎంతో రుచిరా
భద్రాద్రిలో నేటినుంచి వాగ్గేయకారోత్సవాలు
రామదాసు జయంతి సందర్భంగా ఐదు రోజులపాటు నిర్వహణ
భద్రాచలం, జనవరి 24: అసమానమైన భక్తిప్రపత్తులతో శ్రీరాముడికి భద్రాచలంలో ఆలయనిర్మాణం చేయడమే కాకుండా స్వామిని వేల సంకీర్తనలతో కీర్తించిన భక్తరామదాసు 390వ జయంతి సందర్భంగా మాఘమాసం పూర్వభద్ర నక్షత్రం బుధవారం వాగ్గేయకారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 1972లో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటినుంచి 29వ తేదీవరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు.ఇందుకోసం భద్రాద్రి దేవస్థానంలోని చిత్రకూట మండపంలో ఏర్పాట్లను పూర్తిచేశారు. భద్రాద్రి దేవస్థానం, హైదరాబాద్‌కు చెందిన శ్రీచక్రా సిమెంట్స్, నేండ్రగంటి అలివేలుమంగ చారిటబుల్‌ట్రస్టు, విశాఖపట్నానికి చెందిన నాదసుధా తరంగిణి కల్చరల్ ట్రస్టు, విజయవాడ సామగాన లహరి కల్చరల్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వాగ్గేయకారోత్సవాలను నిర్వహిస్తున్నారు.
సంకీర్తనలతో రామయ్యకు సేవ..
వాగ్గేయకారుల్లో భజన సంప్రదాయానికి ఆద్యుడైన అన్నమయ్య ఎన్నో వేల సంకీర్తనలు రచించి మోక్షమార్గం పొందారు. అదేబాటలో 17వ శతాబ్ధానికి చెందిన భద్రాచల రామదాసు భద్రగిరిపై శ్రీరాముడికి గుడిగోపురాలు కట్టించడమే కాకుండా ‘దాశరదీ శతకం’ రచించి తన జీవితం మొత్తం శ్రీరామచంద్రుని సేవలో గడిపారు. నూటికి వందకుపైగా కీర్తనలు భజనసంప్రదాయంలో పాడి తాను తరించి తరతరాల వారిని తరింపజేస్తున్నారు. సంగీత సద్గురు త్యాగరాజస్వామి తన ‘ప్రహ్లాద భక్తి విజయం’ అనే గేయనాటకంలో భక్తరామదాసు తనకు ఆదర్శమని కొనియాడారు. రామదాసు కీర్తనలు భారతీయులకు అత్యంత విలువైన సంపద. వీటిని పరిరక్షించుకునేందుకు శాస్త్రీయ సంగీతం వృద్ధి చేసుకోవడానికి ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయి. దేశం నలుమూలల నుంచి సుమారు 400మంది కళాకారులు భద్రాద్రిలో ఒకే వేదికపై అఖండ బృందగానం చేయడం విశేషం.
తొలిరోజు నగర సంకీర్తనతో శ్రీకారం
వాగ్గేయకారోత్సవాల ప్రారంభ రోజైన బుధవారం తొలుత నగర సంకీర్తనతో కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అనంతరం రామదాసు విగ్రహానికి అభిషేకం చేస్తారు.
రామదాసుకు పట్టువసా్త్రలు సమర్పించిన కంచర్ల వంశస్థుడు
నేలకొండపల్లి, : భక్తరామదాసు (కంచర్ల గోపన్న) జయంత్యుత్సవాలను పురస్కరించుకుని కంచర్ల వంశం పదోతరం వారసుడు శ్రీనివాసరావు దంపతులు భక్తరామదాసుకు పట్టు వసా్త్రలు సమర్పించారు. నేలకొండపల్లి శ్రీభక్త రామదాసు ధ్యాన మందిరంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పట్టు వసా్త్రలను అర్చకుడు సౌమిత్రి రమేష్‌కు అందజేశారు. కంచర్ల శ్రీనివాస్ ప్రతి సంవత్సరం జయంత్యుత్సవాలకు రామదాసుకు పట్టు వసా్త్రలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయపూడి నవీన్, భక్తరామదాసు విద్వత్ కళాపీఠానికి చెందిన సాధు రాధాకృష్ణమూర్తి, మన్నె కోటేశ్వరరావు, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, దేవీప్రసాద్, బొందయ్య తదితరులున్నారు.