ScienceAndTech

భారత్ సహా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం!

భారత్ సహా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం!

ప్రపంచ టెక్ దిగ్గజం మైక్సోసాఫ్ట్ సంస్థ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి. ఎంఎస్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365, అవుట్ లుక్ వంటి సేవలు పనిచేయడం లేదు. బుధవారం ఈ సమస్య ఎదురవడంతో మైక్రోసాఫ్ట్ యూజర్లు ఇబ్బంది పడ్డారు. సేవలు నిలిచిన విషయం నిజమే అయినా.. ఎంత మంది ఈ సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. ఒక్క భారత్ లోనే కాకుండా ఆస్ట్రేలియా, యూఏఈ, జపాన్, బ్రిటన్ దేశాల్లో ఈ సమస్యలు తలెత్తాయి. ఈ విషయాలపై మైక్రోసాఫ్ట్ సంస్థ యూజర్లు నెట్టింట ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు.
మెయిల్స్ రావట్లేదని, అవుట్ లుక్ రిఫ్రెష్ కావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. భారత్ లో మైక్సోసాఫ్ట్ టీమ్స్ విషయంలో ప్రధానంగా సమస్య తలెత్తినట్లు ఓ వెబ్ సైట్ వెల్లడించింది. దాదాపు 3700 యూజర్లు కంప్లైంట్ చేసినట్లు తెలిపింది. అయితే ఒక్క అవుట్ లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ మాత్రమే కాకుండా మైక్సోసాఫ్ట్ కు చెందిన చాలా సేవలకు అంతరాయం వాటిల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. మైక్రోసాఫ్ట్ సేవల్లో ముఖ్యంగా టీమ్స్ కు 28 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ అంతరాయంతో చాలా మంది యూజర్లు ఇబ్బందులు పడ్డట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సంస్థ స్వయంగా స్పందించింది. అంతరాయం కలగడానికి గల కారణాలను అన్వేషిసిస్తున్నట్లు తెలియజేసింది. ముఖ్యంగా సాంకేతిక లోపం వల్లే సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది.