Movies

రానాకు ఆత్మగౌరవం గుర్తొచ్చింది

Bhallaladeva Rana Responds Strongly To Anchors Comment On South Indian Films

‘బాహుబలి’తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కథానాయకుడు రానా. ఆయన భాషతో సంబంధం లేకుండా ఇటు టాలీవుడ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. రానా ఇటీవల ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్‌ దక్షిణాది చిత్ర పరిశ్రమను చులకన చేసి మాట్లాడారు. ‘బాహుబలి’ సినిమాను చూసేంత వరకు దక్షిణాది గురించి తక్కువ అభిప్రాయం ఉండేదని చెప్పారు. అసలు అక్కడి సినిమాల గురించి తనకు ఏమీ తెలియదని అన్నారు. ఆమె వ్యాఖ్యలు రానాకు చిరాకు తెప్పించాయి. అందుకే యాంకర్‌కు పరోక్షంగా బుద్ధి చెబుతూ గట్టిగా సమాధానం ఇచ్చారు. ‘భారతీయులు చుట్టుపక్కల రాష్ట్రాల గురించి తెలుసుకోకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏ చిత్ర పరిశ్రమ (భాష పరంగా) మరో చిత్ర పరిశ్రమకు తీసిపోదు. ఎక్కడైనా సరే అదే కెమెరా, కథ, నటీనటుల బృందం ఉంటుంది. ఎక్కడైనా సినిమా తీసే విధానం ఒకలానే ఉంటుంది. నేను తెలుగులో మాట్లాడితే అది తెలుగు సినిమా అవుతుంది. ఇంగ్లిషులో మాట్లాడితే.. ఇంగ్లిషు సినిమా అవుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఓ సినిమాను ఇలానే తీస్తారు కదా? నిజమేనా? కానీ మనమే మన మనసుల్లో ఇది ఓ చిత్ర పరిశ్రమ, అది మరో చిత్ర పరిశ్రమ అని పరిమితులు ఉంచుకున్నాం. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ.. ఇక్కడ ఏం చేస్తారు? సినిమాలు తీస్తారు. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలోనూ అంతే. ఎక్కడైనా అదే సినిమాలే ఉంటాయి, ఇందులో తేడా ఏముంది? పరిధిని దాటుకుని సినిమాలు తీస్తున్న వారు కూడా ఉన్నారు. రజనీకాంత్‌ సినిమాలు అన్నీ భాషల్లోనూ డబ్‌ అవుతాయి. ‘అవెంజర్స్‌’ కూడా అన్ని భాషల్లోనూ డబ్‌ అయ్యింది. మనం ఏర్పరచే వరకూ దేనికీ హద్దులు ఉండవనే విషయాన్ని గుర్తించాలి’ అని రానా చెప్పారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. రానా సరిగ్గా సమాధానం ఇచ్చారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.