నందమూరి తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఆయన నిలకడగా ఉన్నారు.. అయితే మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో తారకరత్నను బెంగళూరు (Taraka Ratna Shifted To Bangalore)కు తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తె ఆసుపత్రికి వచ్చారు.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో.. డాక్టర్లతో పాటూ అందరితో చర్చించి బెంగళూరుకు తరలించారు. తారకరత్న వెంట సతీమణి అలేఖ్యారెడ్డి, నందమూరి బాలయ్య కూడా వెళ్లారు.
శుక్రవారం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి నుంచి అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్‌ను కుప్పం తీసుకొచ్చారు. ఆ అంబులెన్స్‌లోనే కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే బెంగళూరు నుంచి అత్యాధునిక వైద్య పరికరాలు తీసుకురావడంతో కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలోనే నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు వైద్యం అందించారు. అనంతరం బెంగళూరుకు తీసుకెళ్లారు.
కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. టీడీపీ నేతలతో కలిసి పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పార్టీ కార్యకర్తలు కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత అక్కడి నుంచి పీఈఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే నందమూరి బాలయ్య అక్కడికి చేరుకున్నారు. వైద్యుల్ని అడిగి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
తారకరత్న గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయిందని వైద్యులు గుర్తించినట్లు బాలయ్య తెలిపారు. మిగత పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయని.. తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స అందించిన కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. అలాగే శుక్రవారం సాయంత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలోని పీఈసీ ఆసుపత్రికి వచ్చి తారకరత్నను పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కుప్పంలో తీవ్ర అస్వస్థతకు గురైన లోను కావడం బాధాకరమని.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని తెలిసింది అన్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని.. సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు