Politics

జగన్ పై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు

జగన్ పై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు

అన్నా.. జగనన్నా.. నీ ఫోన్‌ ట్యాప్‌ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు..

ఇంటెలిజెన్స్‌ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. బుధవారం నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

”కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్‌ అధికారులు నాపై నిఘాపెట్టారు. అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకని బాధపడ్డా. నా ఫోన్‌ ట్యాప్‌ అవుతోందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్‌ అధికారి చెప్పారు. సీఎంపై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించా. గత కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్‌ అధికారులు నాపై నిఘా పెట్టారు. అనుమానం ఉన్నచోట ఉండాలని నాకు లేదు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని లేదు. ఆ పార్టీ నుంచి పోటీకి నా మనసు అంగీకరించడం లేదు. నన్ను సంజాయిషీ అడగకుండానే నాపై చర్యలు చేపట్టారు.

నేను ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు ఇబ్బంది అవుతుంది. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ఆయన అన్నారు. బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నా. మంత్రులు, జడ్జిలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్‌ అయిండొచ్చు. మనసు ఒకచోట.. శరీరం మరోచోట ఉండటం నాకిష్టం లేదు. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్‌ ట్యాప్‌ చేస్తే ఎలా ఉంటుంది.” అంటూ తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు.