Politics

వైసీపీకి హ్యాండిచ్చిన నెల్లూరు మేయర్

వైసీపీకి హ్యాండిచ్చిన నెల్లూరు మేయర్

నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి వైసీపీకి హ్యాండ్ ఇచ్చారు. తాము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే ఉంటామని ప్రకటించారు. తనకు చాలా మంది కాల్స్ చేసి ఎటువైపు ఉంటావో తేల్చుకో అంటున్నారని.. ఆలోచించుకుని చెప్పు అని కూడా అంటున్నారని ఆమె మీడియా సమావేశంలో వివరించారు. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదని.. తాను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే ఉంటానని ప్రకటించారు. కోటంరెడ్డి చెబితే తన మేయర్ పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన తన‌కు ఇంతటి అవకాశం వచ్చిందంటే అది శ్రీధర్ రెడ్డి వల్లనేనన్నారు. కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు శ్రీధర్ రెడ్డి మాత్రమేనన్నారు. అన్న శ్రీధర్ రెడ్డి చెబితే బాధతో కాదు.. సంతోషంగా పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. స్రవంతి 12వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు.

ఇకపై తనకు ఎవరూ ఫోన్లు చేసి ఎవరి పక్షం ఉంటావని అడగొద్దు అని మేయ‌ర్ స్ర‌వంతి విజ్ఞప్తి చేశారు. స్రవంతి భర్త జయవర్ధన్‌ తొలి నుంచి శ్రీధర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి సిఫార్సుతోనే స్రవంతికి మేయర్ పదవి దక్కింది. ఇప్పుడు ఆమె శ్రీధర్ రెడ్డి వెంట ఉంటానని చెప్పడంతో.. ఆమెను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు వైసీపీ నాయకత్వం పరోక్షంగా పావులు కదుపుతుందేమో చూడాలి. శ్రీధర్ రెడ్డి మాత్రం తనకు టచ్‌లో పలువురు కార్పొరేటర్లు ఉన్నారని.. కాకపోతే వారి బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వాటి కోసం అక్కడే ఆగాల్సిన పరిస్థితి వారికి ఏర్పడిందన్నారు.