Editorials

ప్రయాణీకులు దొంగతనం చేస్తారు. రైల్వే వారు కిందేసి తొక్కుతారు.

The Disgusting Quality Of Sheets & Pillows In Indian Railways

‘స్వచ్ఛ భారత్‌ – స్వచ్ఛ రైలు’.. రైల్వే మంత్రిత్వశాఖ నినాదమిది. అమల్లో మాత్రం ఆ శాఖ దారుణంగా విఫలమవుతోంది. దీనికి ఉదాహరణ ప్రయాణికులకు పంపిణీ చేస్తున్న బెడ్‌రోల్స్‌. రైళ్లలో ఏసీ కోచ్‌ల్లో ఇస్తున్న దిండ్లు, దుప్పట్లు, రగ్గులు కంపు కొడుతున్నాయి. చాలా రైళ్లలో ఏమాత్రం ఆరోగ్యకరంగా లేనివాటిని, మురికిగా ఉన్నవాటిని ఇస్తున్నారని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిసార్లు నల్లులు, పురుగులు కనిపిస్తున్నాయి. విశాఖ, తిరుపతి, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్‌, కాచిగూడ మీదుగా తిరిగే చాలా రైళ్లలో ఈ పరిస్థితులున్నాయి. ముఖ్యంగా విశాఖ, విజయవాడ మీదుగా వెళ్తున్న రైళ్ల ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు దుప్పట్లు, చిన్న తువాలు, దిండుకవరు కలిపి ఒక కవర్లో ఇస్తారు. దిండు, రగ్గు వేరుగా ఇస్తారు. ఇవన్నీ కలిపి బెడ్‌రోల్‌ అంటున్నారు. ప్రయాణికుల నుంచి మళ్లీ వెనక్కి రావడం లేదనే కారణంతో చిన్న తువాలును ముందుగానే సిబ్బంది తీసేసి పక్కన పడేస్తున్నారు. మిగిలినవాటినైనా పలు రైళ్లలో కవర్లలో పెట్టి ఇవ్వట్లేదు. ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌, లింక్‌, సమతా, కోరమాండల్‌, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లాంటి పలు రైళ్లలో ప్రయాణికుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. బెడ్‌రోల్స్‌ను మరుగుదొడ్ల పక్కన, రైలుపెట్టెల ప్రవేశ ద్వారాల దగ్గర పడేస్తుండటంతో వచ్చిపోయేవారు వాటిని తొక్కేస్తున్నారు. విజయవాడ, సికింద్రాబాద్‌ మీదుగా వెళ్లే రైళ్లలో, విశాఖ నుంచి భువనేశ్వర్‌, కోర్బా వైపు వెళ్లే రైళ్లలో, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లేవాటిలో ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి.

* ప్రతి ప్రయాణికుడికి తాజా బెడ్‌రోల్‌ ఇవ్వాలి. వేరేవారు వాడుకున్నవి ఇవ్వకూడదు. విశాఖ-దిఘా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, హటియా-యశ్వంత్‌పూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి- నిజాముద్దీన్‌ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌-కాచిగూడ ప్రశాంతి నిలయం ఎక్స్‌ప్రెస్‌, రాయలసీమ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-విశాఖ సూపర్‌ఫాస్ట్‌ లాంటి పలు రైళ్లలో వాడేసినవాటినే తిరిగి ఇతర ప్రయాణికులకు ఇస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.
* కొన్ని రైళ్లలో తమకు గంటన్నర తర్వాత కూడా బెడ్‌రోల్‌ చేతికి రావడంలేదనే ఫిర్యాదులున్నాయి.
* బెడ్‌రోల్స్‌ సరిపడినన్ని ఉండట్లేదు. ఒక రైలులో ఏసీ పెట్టెల్లో ఎంతమంది ప్రయాణికులు ఎక్కినా.. వారందరికీ కొత్తగా బెడ్‌రోల్స్‌ ఇవ్వాలి. కానీ అంతస్థాయిలో నిల్వ ఉంచుకోవడంలేదు.
* భువనేశ్వర్‌, విశాఖ, కాచిగూడ లాంటి ప్రాంతాల్లో అధునాతన యాంత్రిక లాండ్రీలున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో బెడ్‌రోల్స్‌ను ఇక్కడ శుభ్రపరుస్తారు. ఇలాంటిచోట్ల బయలుదేరిన రైళ్లలోనూ బెడ్‌రోల్స్‌ దుర్వాసన వెదజల్లుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. లాండ్రీల నుంచి రైలు వరకు తెచ్చేటపుడు వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయటం, రైళ్లలోనూ తగినరీతిలో భద్రపరచకపోవడంతో దుమ్ము, మురికిపట్టి ఉంటున్నాయి.
* దిండ్లను నిర్వహించే బాధ్యత రైల్వే విభాగాలే చూస్తున్నాయి. మురికిగా ఉన్నా, కంపు కొడుతున్నా.. వాటిని పూర్తిగా పక్కపెట్టేయాలి. అలా చేయకుండా కవర్లు మార్చి పంపిణీ చేస్తున్నారు.
* బెడ్‌రోల్స్‌ను పంపిణీ చేసే సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. గుత్తేదారులు తక్కువ సిబ్బందిని పెట్టుకోవడమే దీనికి కారణం.
* విశాఖ-నిజాముద్దీన్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు సరఫరా చేసిన దిండు ఇది. ఎంత మురికిగా ఉందో చూడండి. ఏ-2 కోచ్‌లో సునీల్‌ అగర్వాల్‌ అనే ప్రయాణికుడికి దీన్ని ఇచ్చారు. దిండు ఇలా ఉంటే తనకు నిద్రేం పడుతుందని ప్రశ్నిస్తూ ఆయన రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.
* విశాఖ-న్యూదిల్లీ ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు పంపిణీ చేస్తున్న సమయంలో గుట్టలుగా తెచ్చిన దుప్పట్లను మరుగుదొడ్ల పక్కనే ఎలా పడేశారో.. ఈ చిత్రం చూపుతోంది. నిర్వహణ ఏ స్థాయిలో ఉందో ఇది చాటుతోంది. ఇలా ఎక్కడపడితే అక్కడ పడేస్తే దుర్వాసన రాకుండా ఎలా ఉంటాయన్నది ప్రశ్న.