నందమూరి తారకరత్న ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన గురించి అందరూ కలవరపడుతున్నారు. ఇలాంటి టైంలో నందమూరి ఫ్యామిలీలో మరో యాక్సిడెంట్ జరిగింది
నందమూరి కుటుంబం ప్రస్తుతం బాధలో ఉంది. నారా లోకేష్ యువగళం సందర్భంగా.. తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. ఆ తర్వాత ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన బెంగళూరు తరలించారు. తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉందని, లేదు లేదు అంతా సర్దుకుందని చెప్పుకుంటూ వచ్చారు. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు ఆయనని తరలిస్తారని అంటున్నారు. ఇదంతా ఇలా ఉండగానే నందమూరి ఫ్యామిలీలో మరో ప్రమాదం జరగడం ఫ్యాన్స్ కలవరపెట్టింది.
ఇక విషయానికొస్తే.. హీరో బాలకృష్ణకు సోదరుడు అయిన నందమూరి రామకృష్ణ కారుకు హైదరాబాద్ లో యాక్సిడెంట్ జరిగింది. ఆయన శుక్రవారం ఉదయం కారు నడుపుతూ జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో వెళ్తుండగా అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్ డివైడర్ ని ఢీ కొంది. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారుని పక్కనే నిలిపి అక్కడి నుంచి రామకృష్ణ వెళ్లిపోయారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులు వచ్చి కారుని తీసుకెళ్లారు. కారులో ఆయన ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు.. ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. బెంగళూరులోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తారకరత్నని ఇటీవలే పరామర్శించి వచ్చారు రామకృష్ణ. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. ఎక్మో పెట్టలేదని.. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. తారకరత్న శరీర అవయవాలన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయని న్యూరో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. అంతకు మించి ఎలాంటి ప్రమాదం లేదని క్లారిటీ ఇచ్చారు.