tata: గతంతో పోలిస్తే భారతీయుల జీవన విధానంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ప్రపంచ దేశాలతో వ్యాపార లావాదేవీలు పెరగడంతో.. ప్రజలు ఎక్కువగా విమాన ప్రయాణం వైపు మొగ్గుచూపుతున్నారు. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఆయా విమానయాన సంస్థలు కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ల కోసం ఆర్డర్ లు పెడుతున్నాయి. తాజాగా భారత ఏవియేషన్ చరిత్రలో కుదిరిన ఓ గొప్ప డీల్.. ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశం అయింది. తద్వారా అగ్రరాజ్యం అమెరికాలో లక్షల మందికి ఉద్యోగాలిస్తూ టాటా గ్రూపు చరిత్ర సృష్టించింది.
470 కాదు 840:
టాటా గ్రూపు యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా 470 విమానాల కోసం జంబో ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిలో 250 విమానాలు ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ నుంచి మరో 220 ఎయిర్ క్రాఫ్ట్ లు అమెరికా తయారీ సంస్థ బోయింగ్ నుంచి కొనుగోలు చేయనుంది. అయితే ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్ ఫర్మేషన్ అధికారి నిపున్ అగర్వాల్.. తాజాగా ఓ షాకింగ్ విషయం చెప్పారు. మొత్తం 840 విమానాల కొనుగోళ్ల కోసం తాము ప్రణాళికలు రచించినట్లు గురువారం ప్రకటించారు.
ల్యాండ్ మార్క్ మూమెంట్:
ఈ 840 ఎయిర్ క్రాఫ్ట్ ల కొనుగోలు డీల్ ని.. భారత విమానయాన చరిత్రలో ఓ ‘ల్యాండ్ మార్క్ మూమెంట్’గా నిపున్ అభివర్ణించారు. ఎయిర్ ఇండియా కొనుగోళ్ల గురించి ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఉత్సాహాన్ని చూస్తుంటే, ఆనందంగా ఉందని తన లింక్డ్ఇన్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇప్పటికే 470 విమానాలు ఆర్డర్ చేయగా, రానున్న దశాబ్ద కాలంలో మరో 370 కొనుగోలు చేయనున్నట్లు వెల్లడింంచారు.
నిర్వహణ కోసమూ ఒప్పందాలు:
‘ఎయిర్ బస్ సంస్థకు ఇచ్చిన ఆర్డర్‌లో A320/321 నియో/XLR మోడల్ ప్లేన్ లు 210, A350-900/1000 మోడల్ విమానాలు 40 ఉన్నాయి. బోయింగ్ సంస్థ నుంచి 737-మాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ లు 190, 787 మోడల్ ప్లేన్స్ 20తో పాటు 777లు 10 కొనుగోలు చేస్తున్నాం. ఇంజిన్‌ల దీర్ఘకాలిక నిర్వహణ కోసం CFM ఇంటర్నేషనల్, రోల్స్ రాయిస్ మరియు GE ఏరోస్పేస్ లతో ఒప్పందం చేసుకున్నాం’ తన పోస్ట్ లో తెలిపారు.
చంద్రశేఖరన్ అండ్ టీం:
ఈ ఎయిర్ ఇండియా డీల్ విజయవంతం కావడంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహా నిపున్ అగర్వాల్, యోగేష్ అగర్వాల్ అండ్ టీమ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల ప్రతినిధులతో వారే చర్చలు జరిపారు. భారతీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝన్ ఝన్ వాలాకు చెందిన అకాసా ఎయిర్ సైతం పెద్ద ఆర్డర్ పెట్టనున్నట్లు ఆ సంస్థ CEO వినయ్ దూబే ప్రకటించారు. ఇంతకుముందు ఆర్డర్ చేసిన 72 విమానాల కంటే అతిపెద్ద కొనుగోళ్లు ఈ ఏడాది చివరి నాటికి జరపనున్నట్లు వెల్లడించారు.
అమెరికన్లకు భారీగా కొలువులు:
ఎయిర్ ఇండియా-బోయింగ్ డీల్ ద్వారా అమెరికాలోని 44 రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆ దేశ అధ్యక్షులు జో బైడెన్ తెలిపారు. భారత్-అమెరికా బంధాన్ని ఇది మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. ఎయిర్ బస్ విమానాల కొనుగోళ్లతో ఫ్రాన్స్-ఇండియా సంబంధాలు మరో స్థాయికి చేరాయని ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ ప్రకటించారు.
10 లక్షల అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చిన టాటా ..
