NRI-NRT

చైనాకు సారీ చెప్పను బైడెన్..

చైనాకు సారీ చెప్పను బైడెన్..

త్వరలోనే జిన్​పింగ్​తో మాట్లాడతా

బెలూన్​ వివాదంపై బైడెన్

బెలూన్ కూల్చివేతపై చైనాకు క్షమాపణ చెప్పబోమని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. త్వరలోనే చైనా అధ్యక్షుడితో మాట్లాడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చైనా బెలూన్ కూల్చివేతపై క్షమాపణ చెప్పబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టంచేశారు. గుర్తుతెలియని గగనతల వస్తువుల గుర్తింపు, పర్యవేక్షణ, కూల్చివేతపై పదునైన నిబంధనలు తీసురానున్నట్లు చెప్పారు. బెలూన్‌ కాకుండా కూల్చివేసిన మూడు వస్తువులు ప్రైవేటు కంపెనీలు, పరిశోధనా సంస్థలకు చెందినవని భావిస్తున్నట్లు బైడెన్‌ అన్నారు. ఐతే వాటిని కూల్చివేసినందుకు ఎలాంటి విచారం లేదన్నారు. అమెరికా ప్రజల రక్షణకు, భద్రతకు ఏ వస్తువు వల్ల అయినా ముప్పువాటిల్లే పరిస్థితి ఉంటే కూల్చివేసి తీరతామని స్పష్టంచేశారు. చైనా నిఘా కార్యక్రమంపై విమర్శలు గుప్పించిన బైడెన్‌ తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తే ఊరుకునేదిలేదని వివరించారు. చైనాతో సంప్రదింపులకు మార్గాలు తెరుచుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

“మేము చైనాతో వివాదాన్ని కోరుకోవట్లేదు. చైనాతో పోటీని మాత్రమే కోరుకుంటున్నాము. చైనాతో సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధం కోసం ఎదురుచూడట్లేదు.అధ్యక్షుడు జితో మట్లాడాలని నేను కోరుకుంటున్నాను. దీని వెనక ఉన్న అసలు కారణాన్ని మనం కనుగొనాలని ఆశిస్తున్నాను. ఐతే బెలూన్ కూల్చివేతపై నేను క్షమాపణ చెప్పబోను.”–జో బైడెన్‌, అమెరికా అధ్యక్షుడుకాగా, అంతకుముందు చైనా నిఘా బెలూన్​ గురించి తెలుసుకున్న బైడెన్.. వీలైనంత తొందరగా దాన్ని కూల్చేయమని ఆదేశించారు. అయితే ఆ బెలూన్ కొన్ని స్కూల్ బస్సులంత పరిమాణం ఉండటం వల్ల దాన్ని భూమిపై కూల్చివేస్తే.. అక్కడ నివసించే ప్రజలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని.. మిలటరీ సలహా ఇచ్చిందని ఆయన అన్నారు. దీంతో ఆ చైనా నిఘా బెలూన్​ను నిశితంగా ట్రాక్​ చేసి దాని శక్తి సామర్థ్యాలను విశ్లేషించినట్లు బైడెన్ తెలిపారు. దాని పనితీరును తెలుసుకున్న అనంతరం అమెరికా యుద్ధవిమానాన్ని పంపించి తమ దేశానికి సమీపంలోని అట్లాంటిక్ మహాసముద్రంలో కూల్చివేశారు.