వైసీపీ గూండాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టుందన్న బాబు
పట్టాభిని కిడ్నాప్ చేశారా అని ప్రశ్న
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై తాజాగా డీజీపీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన బాబు.. వైసీపీ తీరుపై మండిపడ్డారు. వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు కనబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు దాడులకు దిగుతుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని ఆరోపించారు. పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారా..? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలు దొంతు చిన్నా, పట్టాభి భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేసినట్టు టీడీపీ అధినేత పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. పోలీసులు గన్నవరంలో సెక్షన్ 144 విధించారు. పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ కార్యాలయాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వల్లభనేని వంశీ అనుచరులే టీడీపీ కార్యాలయంపై దాడి చేసినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.