Devotional

భద్రాద్రిలో భారీ ఎత్తున శ్రీరామనవమి ఏర్పాట్లు…

భద్రాద్రిలో భారీ ఎత్తున శ్రీరామనవమి ఏర్పాట్లు…

శ్రీరామ నవమి ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

ఫిబ్రవరి 21: శ్రీరామనవమి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, భద్రాచలం వచ్చే ప్రతీ భక్తుడు వేడుకలను ప్రశాతంగా వీక్షించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో మంగళవారం భద్రాచలంలో జరగబోయే శ్రీరామనవమి, పుష్కరసామ్రాజ్య పట్టాభిషేక వేడుకల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్‌ పలు ఆదేశాలిచ్చారు. గతేడాది భక్తుల మన్ననలు పొందేలా ఘనంగా ఏర్పాట్లు చేశామని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలన్నారు. మార్చి 30న శ్రీరామనవమి, 31న పుష్కర పట్టాభిషేకం నిర్వహించనున్న మిథిలాస్టేడియంలో సెక్టారు ప్రణాళిక పక్కాగా తయారు చేయాలని, భక్తుల నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ సెక్టార్‌ పర్యవేక్షణకు ఓ జిల్లా అధికారిని ప్రత్యేకంగా నియమించనున్నామని, వేడుకలు నిర్వహణకు కార్యాచరణతో పాటు పర్యవేక్షణా ముఖ్యమేనన్నారు. వచ్చే నెల 25నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఒకటో తేదీ నుంచి ఆనలైనలో టిక్కెట్లు అందుబాటులో ఉంచాలని, టికెట్లు నేరుగా కొనుగోలు చేసేందుకు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్‌, మీసేవా, కార్గో సర్వీసుల ద్వారా భక్వులకు స్వామివారి తలంబ్రాలు, ప్రసాదాలు చేరవేసేలా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు సమాచారం అందించేందుకు సామాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డీపీఆర్‌వోను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడపాలని, బస్సుల్లో వచ్చే భక్తులకు ఉచితంగా తలంబ్రాలు పంపిణీ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పారిశుధ్య పనుల నిర్వహణకు ప్రత్యేక సిబ్బందని ఏర్పాటు చేయాలని, ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో తాగునీరు, మజ్జిగ అందించాలని, స్వామివారి ప్రసాదాలు, హోటళ్లులోని ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేయాలని, తినుబండారాలను అధిక ధరలకు విక్రయించకుండా హోటల్‌ యజమానులతో సమావేశం నిర్వహించి ధరలను నిర్ణయించాలన్నారు. వాహనాల పార్కింగ్‌ స్థలాల ఏర్పాటు, భక్తులు వాటిని గుర్తించేందుకు వీలుగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు గోదావరిలోపలికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను మోహరించాలని, నాటు పడవలను సిద్ధంగా ఉంచాలన్నారు. 24గంటల అత్యవసర వైద్యశిబిరాల ఏర్పాటు, నిరంతరాయంగా విద్యుత సరఫరా, ప్రత్యామ్నాయంగా జనరేటర్లు సిద్ధం చేయడం, ట్రాఫిక్‌ నియంత్రణ, అగ్నిమాపక వాహనాల మోహరింపు, ప్రముఖుల రాకకోసం హెలీప్యాడ్‌ ఏర్పాటు తదితర అంశాలపై ఆదేశాలిచ్చారు. అలాగే ఆ వేడుకల సమయంలో పర్ణశాల వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో భద్రాద్రి దేవస్థానం ఈవో రమాదేవి, డీపీవో రమాకాంత, డీఆర్‌డీవో మధుసూధనరాజు, డీఎంహెచవో డాక్టర్‌ శిరీష, డాక్టర్‌ రవిబాబు, ఆర్టీవో వేణు, ఎనహెచ డీఈ శైలజ, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలు స్వర్ణలత, రత్నకళ్యాణితో పాటు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.