Politics

ప్రధాని మోదీ, అదానీ ఒక్కటే.. కాంగ్రెస్ ప్లీనరీలో రాహుల్ ఫైర్..

ప్రధాని మోదీ, అదానీ ఒక్కటే.. కాంగ్రెస్ ప్లీనరీలో రాహుల్ ఫైర్..

రాయ్‌పూర్‌: ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల మూడో రోజు ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

అదానీకి, మోదీకి సంబంధమేంటని పార్లమెంటులో తాను ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు ఆయనకు వత్తాసుపలికేలా మాట్లాడుతున్నారని రాహుల్ విమర్శించారు. అదానీ గురించి పార్లమెంటులో ప్రశ్నించవద్దని బీజేపీ నేతలు అంటున్నారని, కానీ వాస్తవం ప్రజలకు తెలిసే వరకు తానూ ఈ విషయంపై ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు.

‘భారత్‌ జోడో యాత్రలో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రజలు, రైతుల సమస్యలు దగ్గరుండి చూశా. కులం, మతం, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచి జోడో యాత్రకు విశేష స్పందన లభించింది. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా ప్రజలు నాతోపాటు నడిచారు. ఈ యాత్ర నాకు పాఠాలు నేర్పింది. నాలుగు నెలల పాటు ఓ తపస్సులా ఈ యాత్ర సాగింది. కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపాము. కానీ బీజేపీ దాన్ని తీసుకెళ్లింది.’ అని రాహుల్ వ్యాఖ్యానించారు..