Devotional

తిరుమల శ్రీవారి చెంత వైభవంగా తిరుపతి 893వ జన్మదిన వేడుకలు: శోభాయాత్రలో ఎమ్మెల్యే భూమన!

తిరుమల శ్రీవారి చెంత వైభవంగా తిరుపతి 893వ జన్మదిన వేడుకలు: శోభాయాత్రలో ఎమ్మెల్యే భూమన!

తిరుమల శ్రీవారి చెంత కన్నుల పండుగగా తిరుపతి 893వ జన్మదిన వేడుకలు జరిగాయి. రామానుజాచార్యుల శోభాయాత్రలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి గొప్పతనాన్ని చెప్పారు.

తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి 893 వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మనుషులకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం తెలుసు కానీ, ఒక ప్రాంతానికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఒక్క తిరుపతిలోనే కనిపిస్తుంది. నిన్న తిరుపతిలో కన్నుల పండుగగా జరిగిన వేడుకల విశేషాలు అన్నీ ఇన్నీ కావు.

ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి జన్మదిన వేడుకలు శ్రీవారి పూజా కైంకార్యాలను నిర్దేశించిన జగద్గురు శ్రీ రామానుజాచార్యులే స్వయంగా శంకుస్థాపన చేసిన ఒక నాటి బ్రాహ్మణ అగ్రహారమైన నేటి తిరుపతి… పరపతి మరింత ఎత్తుకు పెరిగేలా ఎమ్మెల్యే,టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుక కొనసాగింది. తిరుపతి పుట్టినరోజు సందర్భంగా తొలుత శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భూమన కరుణాకర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ గోవిందరాజు స్వామి వారికి సమర్పించారు.

కన్నులపండుగగా గోవిందరాజ స్వామి శోభాయాత్ర శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద అర్చకులు, జీయర్ స్వాముల ఆశీస్సులు తీసుకుని శోభాయాత్రను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఆద్యంతం కన్నుల పండుగగా సాగిన శోభాయాత్రలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు,మంగళ వాయిద్యాలు, భజన మండళ్ళ కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులు అనేక కార్యక్రమాలను నిర్వహించారు. చెక్క భజనలు చేస్తూ, కోలాటాలతో నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తులుపౌరాణిక వేషధారణలో నగరవాసులను ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ తిరుపతి పట్ల, సమతామూర్తి రామానుజాచార్యుల పట్ల తమ భక్తి ప్రపత్తులు ప్రదర్శించారు.కనుల పండగలా కొనసాగిన ఆధ్యాత్మిక తిరుపతి శోభాయాత్ర ఆద్యంతం..గోవింద నామ స్మరణలతో సాగింది. తిరుపతి జన్మదినం రోజున తిరుపతి నగరం పులకించిపోయింది.

అడుగడుగునా భక్తుల నీరాజనాలు.. జయజయ ధ్వానాలు అడుగడుగునా భక్తులు స్వామివారి శోభాయాత్రకు నీరాజనాలు .. జయజయ ధ్వానాలతో స్వాగతం పలికారు . ప్రతి ఇంటికి పచ్చ తోరణాలు కట్టి, పసుపు నీళ్లు గుమ్మరించి, పువ్వులతో రామానుజాచార్యుల శోభాయాత్రకు స్వాగతం పలికారు. కర్పూర హారతులు పడుతూ భక్తి వ్యక్తం చేశారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. జగద్గురు శ్రీ రామానుజాచార్యుల వారి చిత్రపటాలను ప్రదర్శించి తిరుపతి పుట్టుకను గుర్తు చేశారు. తిరుపతి ప్రజలంతా సమతా స్ఫూర్తిని చాటే వారి ముందుకు సాగారు. పుణ్యక్షేత్రమైన తిరుపతి ప్రతి సంవత్సరం ఘనంగా కొనసాగాలని జీయర్ స్వాములు ఆకాంక్షించారు.

తిరుపతి గొప్పతనం చెప్పిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి గొప్పతనాన్ని తెలియజేశారు. ముక్కోటి దేవతలు గోవిందరాజు స్వామిని పూజిస్తారని, శ్రీ మహా విష్ణువే వెంకటేశ్వర స్వామి అవతారంలో స్వయంభుగా వెలసిన మహా పుణ్యక్షేత్రమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుపతికి నామకరణం చేసిన సమతా మూర్తి శ్రీ రామానుజాచార్యుల వారి గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు.