Kids

దూరంగానే ఉందాం..

దూరంగానే ఉందాం..

ఒకసారి రోమశుడనే పిల్లి వేటగాడి వలలో చిక్కుకుంది. ఇదే అదను అనుకుని ఫలితుడనే ఎలుక ధైర్యంగా కలుగు లోంచి బయటకు వచ్చింది.

అంతలోనే ముంగిస, గుడ్లగూబ కనిపించడంతో ఎలుకకు మళ్లీ భయమేసింది. ఎలుక ఆలోచించింది. పిల్లి చెంతకు వెళ్లి ‘ఈ వలను కొరికి నిన్ను రక్షించగలను. నువ్వు పక్కనుంటే నాకెంతో ధైర్యంగా ఉంటుంది, ఏవీ నా జోలికి రావు. మనిద్దరం స్నేహంగా ఉంటూ ఒకరికొకరం సాయం చేసుకుందాం’ అంది. వల నుంచి తప్పించుకునే మార్గం లేని పిల్లి సరేనంది. పిల్లి తన నేస్తమన్నట్టు పక్కనే కూర్చోవడంతో ముంగిస, గుడ్లగూబ అక్కణ్ణించి వెళ్లిపోయాయి. ఎలుక ఎంతకూ వలను కొరకకపోయేసరికి ‘నేను వెంటనే సాయం చేశాను కదా! మరి నువ్వెందుకు ఇలా కాలయాపన చేస్తున్నావు?’ అంది పిల్లి. ‘నాకు ప్రాణదానం చేసిన నిన్ను కాపాడకుండా ఉంటానా? కానీ వల నుంచి బయటకు రాగానే నన్ను చంపుతా వేమోనని భయం. వేటగాడు కనిపించగానే వలని కొరుకుతాను. అప్పుడైతే అతడి భయంతో గబుక్కున చెట్టెక్కుతావు. నా జోలికి రావు’ అంది ఎలుక.

‘నిన్నేమీ చేయను’ అన్న పిల్లితో ‘రాత్రి నుంచీ ఆకలితో ఉన్న నువ్వు నన్ను తినవంటే నమ్మలేను. బోయ కనిపించగానే చకచకా వల కొరికేస్తాను, భయపడకు’ అంది. పిల్లికి నమ్మకం కలిగించేందుకు అక్కడే ఉండి, వేటగాణ్ణి చూడగానే వలను కొరికేసి కలుగులోకి వెళ్లిపోయింది. పిల్లి చెట్టు ఎక్కేసింది. మర్నాడు పిల్లి కలుగు దగ్గరకు వెళ్లి తనను రక్షించినందుకు కృతజ్ఞత తెలియజేసి తనతో మైత్రి కొనసాగించమంది. ‘అది తగదు. అవసరానికి శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారొచ్చు. కానీ దీర్ఘకాలానికి అది అనుకూలం కాదు. నీది సద్బుద్ధే అయినా నీ బంధువుల వల్ల నాకు హాని కలగొచ్చు. కనుక మనం దూరంగానే ఉందాం’ అంది ఎలుక. బలవంతుడైన శత్రువుతో అవసరం కొద్దీ మైత్రి చేసుకున్నా, ప్రయోజనం నెరవేరాక దాన్ని ఛేదించాలన్న శుక్రనీతికి ఉదాహరణ ఈ కథ.

ఓం నమః శివాయ