వెరీ వెరీ స్పెషల్.. అనగానే రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, క్రీడా ప్రముఖులు, బడా వ్యాపార వేత్తలుగా భావిస్తాం. వారి చుట్టూ సెక్యూరిటీ, ప్రత్యేక సౌకర్యాలు, గౌరవం లభిస్తాయి. సభలు, సమావేశాల్లో మనకు ఇలా వీవీఐపీ అని బోర్డులు కూడా దర్శనమిస్తాయి. అయితే. ఇక్కడ ఓ చెట్లు వీవీఐపీగా మారింది. దాని రక్షణకు 24 గంటలు పోలీసుల కాపలా ఉంటున్నారు. ఆ చెట్టు చుట్టూ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.
మెయింటనెన్స్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరి ఆ చెట్టు ప్రత్యేత ఏమిటి, ఎక్కడుందో తెలుసుకుందాం.
అందుకే అంత ప్రత్యేకం..
మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా సలామత్పూర్లో ఉంది ఈ వీవీఐపీ వృక్షం. ఇది బోధి (రావి) వృక్షం. రావి వృక్షాలు అంతటా ఉంటాయి కదా అంత ప్రత్యేక ఏమిటి అంటే. 2012, సెప్టెంబర్ 21న ఈ వృక్షాన్ని అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే నాటారు. బౌద్ధమతంలో బోధి వృక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున దీనిని ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు. బోధి వృక్షం కిందే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని పొందాడని చెబుతారు. అంతే కాదు అశోక చక్రవర్తి కూడా ఈ చెట్టు సాయంతోనే శాంతి బాటపట్టారట. అందుకే ఆ చెట్టు ప్రత్యేకత సంతరించుకుంది.
పటిష్ట రక్షణ చర్యలు
ఈ రావి చెట్టు రక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. చెట్టు చుట్టూ 15 అడుగుల ఎత్తులో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎవరూ హాని చేయకూడదన్న ఉద్దేశంతో ఇద్దరు గార్డులు 24 గంటలు కాపలాగా ఉంటున్నారు. దీనిపై సాంచి మున్సిపల్ కౌన్సిల్, పోలీస్, రెవెన్యూ, హార్టికల్చర్ శాఖలు నిరంతరం నిఘా ఉంచాయి. ఈ చెట్టు ఆకు రాలిపోతే అధికారులు వెంటనే అక్కడికి చేరుకుంటారు. 15 రోజులకోసారి వైద్య పరీక్షలు నిర్వహించి.. అందుకు తగ్గ మోతాదులో ఎరువు, నీరు అందిస్తారు.
ఏటా రూ.12 నుంచి రూ.15 లక్షల ఖర్చు..
రైసెన్ జిల్లాలో ఉన్న సాంచి ఒక పర్యాటక ప్రదేశం. ఇక్కడ ఏన్నో ఏళ్ల క్రితం బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. యూనివర్సిటీ ఆవరణలోని కొండపైనే ఈ బోధి వృక్షాన్ని నాటారు. ఆ సమయంలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సేతోపాటు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ చెట్టు సంరక్షణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏటా రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చు చేస్తోంది.
ఒక్కసారైనా చూడాల్సిందే..
ఈ వీవీఐపీ చెట్టును చూడాలంటే సాంచికి రావాల్సిందే. సాంచి నుంచి 8 కి.మీ. దూరంలో ఈ చెట్టు ఉన్న ప్రాంతం ఉంటుంది. భోపాల్, ఇండోర్ నుంచి సాంచి చేరుకోవచ్చు. భోపాల్ నుంచి సాంచి 50 కి.మీ దూరంలో ఉంది. విమానంలో సాంచి చేరుకునే సౌకర్యం లేదు. భోపాల్‌లోని రాజభోజ్ విమానాశ్రయానికి విమానంలో దిగి అక్కడి నుంచి సొంత వాహనం లేదా బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఒక్కసారైనా ఈ చెట్టును చూడాల్సిందే అంటున్నారు సాంచి వాసులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం.