Business

అదానీ ఒక్కరే కాదు.. మరో భారత దిగ్గజ పారిశ్రామిక వేత్తకు తీవ్ర కష్టాలు.. అప్పుల ఊబిలో..!

అదానీ ఒక్కరే కాదు.. మరో భారత దిగ్గజ పారిశ్రామిక వేత్తకు తీవ్ర కష్టాలు.. అప్పుల ఊబిలో..!

ప్రస్తుతం హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు గౌతమ్ అదానీ సామ్రాజ్యం ఎలా కుప్పకూలుతుందో చూస్తూనే ఉన్నాం. లక్షల కోట్ల మేర గ్రూప్ మార్కెట్ విలువ, లక్షల కోట్ల వ్యక్తిగత సంపద కూడా పతనమైంది. అయితే.. ఒక్క అదానీనే కాదు.. మరో భారత కుబేరుడు, వేదాంతా అధినేత అనిల్ అగర్వాల్ కూడా మార్కె్ట్లలో తుపాను సృష్టించే అవకాశం ఉందని అమెరికా దిగ్గజ విశ్లేషణ సంస్థ S&P హెచ్చరించింది. ఆ సంగతేంటో చూద్దాం.

గౌతమ్ అదానీ.. సరిగ్గా నెల కిందట దిగ్గజ పారిశ్రామిక వేత్తగా.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు అంతా తలకిందులైంది. నెల రోజుల వ్యవధిలోనే 236 బిలియన్ డాలర్ల అదానీ సామ్రాజ్యం.. ఏకంగా అయిదింట మూడొంతులు కోల్పోయింది. ఎంత వేగంగా వృద్ధి చెందారో.. అంత కంటే చాలా వేగంతో సంపదను కోల్పోతున్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు కకావికలమయ్యాయి. గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లకుపైగా కోల్పోయింది. ఇక వ్యక్తిగతంగానూ సంపద లక్షల కోట్ల మేర కోల్పోయారు. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలోనూ ఏకంగా 3వ స్థానం నుంచి 30 అవతలికి చేరారు. అయితే అదానీ మాత్రమే కాదు.. ఇప్పుడు భారత కుబేరుడు, వేదాంతా గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్ కూడా మార్కెట్లలో చిన్నపాటి తుపాను సృష్టించే అవకాశముందని.. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు చేసే దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ హెచ్చరించింది

గతంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో నమోదైన వేదాంత రీసోర్సెస్‌కు అనిల్ అగర్వాల్ అధినేత. అయితే ఇప్పుడు ఆ కంపెనీ అప్పుల ఊబిలో చిక్కుకుంది. వచ్చే జనవరిలో 100 కోట్ల డాలర్ల బాండ్లకు గడువు ముగుస్తుంది. ఇప్పుడిప్పుడే తన రుణాలను మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తోంది. ఇక ఈ 11 నెలల్లో తన రుణాలను 2 బి.డాలర్ల మేర తగ్గించుకుని.. 7.7 బిలియన్ డాలర్ల వరకు తీసుకొచ్చింది. ఇది భారత కరెన్సీలో రూ.64 వేల కోట్లకుపైనే. ఇక 2023 సెప్టెంబర్ వరకు సంస్థ రుణాలకు ఇబ్బంది ఉండబోదని S&P అభిప్రాయపడింది. తర్వాతే అసలు చిక్కులు అని వివరించింది. ఇక.. సెప్టెంబర్ నుంచి.. 2024 జనవరి వరకు తీర్చాల్సిన రుణ బాండ్ల కోసం ఏకంగా 150 కోట్ల డాలర్లు.. అంటే సుమారు రూ.12,450 కోట్ల మేర నిధుల సమీకరణ చేపట్టాల్సి ఉంది. అయితే ఇందుకోసం అనిల్ అగర్వాల్ చేస్తున్న ప్రయత్నాలకు వరుస అడ్డంకులు ఎదురవుతుండటం ఆందోళనకరంగా ఉందని ఎస్ అండ్ పీ వివరించింది.

రానున్న కొన్ని వారాలు అనిల్ అగర్వాల్‌కు చాలా కీలకమని.. అందులో ఫెయిల్ అయితే ఇప్పటికే బి- క్రెడిట్ రేటింగ్‌లో ఉన్న బాండ్లు.. మరింత ఒత్తిడిలోకి వెళ్తాయని కొద్దిరోజుల కిందట ఎస్ అండ్ పీ హెచ్చరించింది. అదానీతో పోలిస్తే ఈయనకు ఉన్న అప్పులు కాస్త తక్కువే అయినా.. బాండ్ల రేటింగ్ ఇక్కడ ఇబ్బంది కలిగించే అంశం.
ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ జింక్‌లో అనిల్ అగర్వాల్.. తన వాటాను 20 ఏళ్ల కిందటి నుంచే పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం అందులో 200 కోట్ల డాలర్ల వరకు నగదు నిల్వలున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలో వేదాంతా లిమిటెడ్‌కు 65 శాతం వాటా ఉంది. వేదాంతాలో 70 శాతం వాటా వేదాంతా రిసోర్సెస్‌దే. అయితే THL జింక్ మారిషస్ వాటాను.. హిందుస్థాన్ జింక్‌కు విక్రయించాలని వేదాంతా భావిస్తుండగా.. అందులో 30 శాతం వాటా ఉన్న కేంద్రం ఒప్పుకోట్లేదు.

ఇక అగర్వాల్ ముందు ప్రస్తుతం రెండు సమస్యలు ఉన్నాయి. హిందుస్థాన్ జింక్ వద్ద నగదు నిల్వలను వాడుకోకుంటే రుణ సామర్థ్యం తగ్గుతుంది. అప్పులు తీర్చాలంటే మళ్లీ అప్పులు చేయడమే దిక్కు. అమెరికాలో కూడా తక్కువ వడ్డీకి అప్పులు పుట్టకపోవచ్చు.
మరో సమస్య రాజకీయపరమైంది. ఆస్తుల విక్రయం గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే గనుక.. దేశీయంగా గుజరాత్‌లో, ఫాక్స్‌కాన్‌తో కలిసి అనిల్..19 బి.డాలర్లతో ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్ ఫ్యాక్టరీ భవిష్యత్తు అగమ్యగోచరం కానుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు దీనిపై గుర్రుగా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి ఈ ప్రాజెక్టును మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు మార్చడమే అందుకు కారణంగా చెప్పొచ్చు.