ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతో పాటు హోలీ వేడుకల్లో పాల్గొననున్నారు.
అలాగే అహ్మదాబాద్‌లో భారత్ , ఆస్ట్రేలియాల మధ్య జరిగే నాలుగో టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించనున్నారు అల్బనీస్.దీనికి సంబంధించి న్యూఢిల్లీ, కాన్‌బెర్రాల నుంచి ఏకకాలంలో అధికారిక ప్రకటన విడుదలైంది.
భారత్‌తో తమ సంబంధం బలంగా వుందని.అది మరింత బలంగా వుంటుందని అల్బనీస్ అన్నారు.
బలమైన భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం మన ప్రాంతం స్థిరత్వానికి మంచిదని ఆయన పేర్కొన్నారు.క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కోసం ఆస్ట్రేలియాలో ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వడానికి, జీ 20 లీడర్స్ సమ్మిట్ కోసం సెప్టెంబర్‌లో మరోసారి భారతదేశాన్ని సందర్శించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని పేర్కొన్నారు.
భారత్‌లో జరగనున్న ఇండియా – ఆస్ట్రేలియా వార్షిక లీడర్స్ సమ్మిట్‌కు ఇద్దరు ప్రధానులు హాజరవుతారు.ఈ సందర్భంగా వారు వాణిజ్యం, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, సాంకేతికత, రక్షణ, భద్రతా సహకారంపై చర్చిస్తారు.ఈ పర్యటన రెండు దేశాల మధ్య బలమైన విద్యా , సాంస్కృతిక సంబంధాలను హైలైట్ చేయనుంది.అలాగే ఆస్ట్రేలియాలో అరుదైన లోహాల తవ్వకాలలో భారతీయుల ఆసక్తిని సూచిస్తూ.
ముంబైలో జరిగే ఇండియా ఆస్ట్రేలియా సీఈవో ఫోరమ్‌లో అల్బనీస్ పాల్గొంటారు.ఆయనతో పాటు ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ టూరిజం మంత్రి డాన్ ఫారెల్, రిసోర్సెస్ మినిస్టర్ మడేలిన్ కింగ్‌లు కూడా హాజరవుతారు.
వీరి వెంట సీనియర్ ఆస్ట్రేలియన్ వ్యాపార ప్రముఖుల ప్రతినిధి బృందం కూడా వుంటుంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ కార్యదర్శి పెన్నీ వాంగ్ న్యూఢిల్లీలో వున్నారు.క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం, జీ20 ఎఫ్ఎంఎం భేటీలో ఆమె పాల్గొన్నారు.అంతకుముందు గత నెలలో ఆస్ట్రేలియాలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో కలిసి పెన్నీ వాంగ్ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరైన ట్రాక్‌లో వున్నాయన్నారు.అలాగే భారతీయ సమాజాన్ని లక్ష్యంగా చేసుకునే రాడికల్ కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఆయన ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరారు.