NRI-NRT

కొవిడ్‌ మూలాల గురించి తెలిస్తే చెప్పండి : డబ్ల్యూహెచ్‌వో విజ్ఞప్తి

కొవిడ్‌ మూలాల గురించి తెలిస్తే చెప్పండి : డబ్ల్యూహెచ్‌వో విజ్ఞప్తి

జెనీవా: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) మూలాల గురించి తెలిసిన సమాచారాన్ని తమతో పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది. వైరస్‌ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి, ఇన్ని దేశాలకు పాకిందనే దానిపై కచ్చితమైన సమాచారం ఇంతవరకు లభించలేదు. చైనా ప్రయోగశాల నుంచే వైరస్‌ ఆవిర్భవించిందని మొదటినుంచీ అనుమానాలు వ్యక్తమవగా, దానిపై అమెరికా ఇటీవల మరో నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. ‘కరోనా మూలాల గురించి ఏ దేశం వద్ద అయినా సమాచారం ఉంటే దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ సైన్స్‌ సంస్థలకు వెల్లడించాలి. ఇది అత్యావశ్యం. దీనిని సేకరించేది ఏ ఒక్కరినో నిందించడానికి కాదు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ముందస్తుగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగానే ఈ సమాచారాన్ని కోరుతున్నాం. కరోనా మూలాన్ని గుర్తించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలేయం’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ చెప్పారు.